- ఒకరి పరిస్థితి విషమం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కళ్ళు తెరవని రోజుల పసికందు, మగ పిల్లాడు పుట్టాడని ఆనందం ఆ ఇంట ఎంతో సమయం నిలువలేదు. కొడుకు పుట్టాడని, బంధుమిత్రులతో కలిసి బారసాల చేసుకుందామని కలలుగన్న ఆ తండ్రి ఆశలు అడియాసలుగా మిగిలాయి. కొడుకు బారసాలకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు తన మిత్రులతో కలిసి విజయనగరం మార్కెట్ కు వచ్చిన ఆ తండ్రిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కొడుకు పుట్టాడని ఆనందిస్తున్న ఆ తల్లికి కట్టుకున్న భర్త అకాల మరణం పొందాడని సమాచారం తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ హృదయ విధారకర సంఘటన మంగళవారం రాత్రి కేఎల్ పురం వద్ద చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి విజయనగరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెంటాడ మండలం కోంపంగి గ్రామానికి చెందిన జెసిబి డ్రైవర్ గా పనిచేస్తున్న భోగిన సత్యనారాయణ(32) కు కొద్దిరోజుల క్రితం మొదటి సంతానంగా బాబు పుట్టాడు. దీంతో సత్యనారాయణ తన కుమారుని బారసాల సామాగ్రిని కొనేందుకు మ్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న తన మిత్రులైన అదే మండలం జక్కువ గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి సుందర రావు అలియాస్ రాజు (25), బొడ్డు గౌరీ శంకర్ల తో కలిసి మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై విజయనగరం వచ్చారు. మార్కెట్ పనులు ముగించుకున్న అనంతరం ముగ్గురు మిత్రులు విజయనగరంలో భోజనం చేసిన తర్వాత తమ స్వగ్రామాల కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కేఎల్ పురం వద్ద ఆర్టీవో కార్యాలయం నుంచి విజయనగరం వైపు వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలు పాలై ఒకరు సంఘటనా స్థలంలో మృతిచెందగా, మరొకరు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో వ్యక్తి గౌరీ శంకర్ తీవ్ర గాయాలతో విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ సంఘటనలో భోగిన సత్యనారాయణ, లచ్చిరెడ్డి సుందర రావు మృతిచెందగా, గౌరీ శంకర్ విశాఖలో చికిత్స పొందుతున్నాడు. ఒకటవ పట్టణ ఎస్సై గోపాల్, ఏఎస్ఐ జగన్మోహన్ రావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










