Aug 13,2022 07:55

* 11 నెలలుగా చెల్లింపుల్లేవు
* 45 శాతం ప్రైవేటువే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : 
గ్రామాల్లో ప్రైవేటు భవనాల్లో నడిపిస్తున్న రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)కు ప్రభుత్వం నెలల పర్యంతం అద్దెలు బకాయి పడింది. పదకొండు మాసాలుగా భవన యజమానులకు అద్దెలు చెల్లించట్లేదు. నిధుల సమస్య మూలంగా అద్దె చెల్లింపులు నిలిచిపోయాయని వ్యవసాయశాఖ చెబుతోంది. సకాలంలో అద్దెలు చెల్లించనందున బిల్డింగ్‌ ఓనర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని, కొన్ని చోట్ల ఖాళీ చేయమంటున్నారని, ఎలాగొలా నెట్టుకొస్తున్నామని క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. 'ఆర్‌బికెలు ముఖ్యమంత్రి జగన్‌ మానస పుత్రికలు' అన్న కొటేషన్‌ ప్రచారంలో ఉంది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు సమస్త సేవలూ గ్రామాల్లోనే అందించే ఉద్దేశంతో ఆర్‌బికెలను 2020 మేలో ప్రభుత్వం నెలకొల్పింది. అర్బన్‌, రూరల్‌ కలుపుకొని రాష్ట్రంలో 10,778 ఆర్‌బికెలను ఏర్పాటు చేశారు. ఆర్‌బికెలకు సొంత భవనాలు నిర్మించతలపెట్టగా దశల వారీగా ఇప్పటి వరకు పూర్తయినవి రెండు వేల లోపే. వేలల్లో ఇంకా నిర్మాణదశలోనే ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఆర్‌బికెలకు సొంత భవనాలు నిర్మిస్తున్నారు.
4,800 పైనే
ప్రస్తుతం ఎపి వ్యాప్తంగా 4,800 పైచిలుకు ఆర్‌బికెలు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. ఉన్న ఆర్‌బికెలలో 45 శాతం అద్దె బిల్డింగ్‌లే. ఒక్కో మండలంలో నాలుగైదే సొంత భవనాలని, మిగతావి అద్దెవని, పదకొండు నెలలుగా అద్దె చెల్లించట్లేదని చెబుతున్నారు. ఒక్కో జిల్లాకు ఎంత లేదన్నా రూ.50ా60 లక్షల అద్దె బకాయిలున్నాయని, రాష్ట్రం మొత్తంమ్మీద రూ.12ా15 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉందని తెలుస్తోంది. రైతులకు సేవలందించే కేంద్రాలకు అద్దెలు పెండింగ్‌ పెట్టడం ఇబ్బందికరమని క్షేత్ర స్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులను ఆరా తీయగా బిల్లులు ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. అతి త్వరలోనే చెల్లిస్తామన్నారు.
కలర్స్‌కూ ఇవ్వలేదు
రెండేళ్ల కింద ఆర్‌బికెల ప్రారంభ సమయంలో బిల్డింగ్‌లకు రంగులు వేయించారు. పై నుంచి వచ్చిన ఒత్తిడితో మండల, సబ్‌ాడివిజన్‌ స్థాయి అధికారులు తమ జేలుల్లో నుంచి రంగులకు ఖర్చు చేశారు. దొరికిన చోట దాతలను ఆశ్రయించారు. కరోనా తొలి దశ విజృంభించే వేళ అధిక వ్యయ ప్రయాసలకోర్చి రంగులు వేయించగా, ఇప్పటి వరకు ఆ బిల్లులు రాలేదని అధికారులు వాపోతున్నారు.