Nov 13,2023 21:19

గరివిడి: బైక్‌ ర్యాలీ చేస్తున్న సిపిఎం నాయకులురక్షణ భేరి సభ విజయవంతానికి ప్రచారం

అసమానతలు లేని అభివృద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కారానికి సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి కార్యక్రమంలో భాగంగా ఈనెల 15న విజయవాడలో జరగబోయే మహా బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎస్‌.కోట, జామి, లక్కవరపుకోట, వేపాడ మండలాల్లో సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార ఆటో జాతాను నిర్వహించారు. విజయనగరంలో సభ, గరివిడిలో బైక్‌ ర్యాలీ చేపట్టారు.
ప్రజాశక్తి- శృంగవరపుకోట : 
సిపిఎం ప్రజా రక్షణ భేరిలో భాగంగా ఈ నెల 15న చలో విజయవాడ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలోని దేవి కూడలి వద్ద ప్రచార జాత ఆటోను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లౌకికవాదం ప్రజాస్వామ్య పరిరక్షణ అసమానతలు లేని అభివృద్ధి కోసం ఆటో ప్రచారజాత జరిగిందన్నారు. మోడీ వచ్చి పదేళ్ల కావస్తున్నా నిరుద్యోగం తీవ్రమైందని, లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని అడ్డుగా అమ్మేస్తున్నారని ఆంధ్రుల హక్కు అయిన స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి పెట్టారని, రైల్వేలు, బ్యాంకులు ప్రైవేటు పరం అవుతున్నాయని, నిరుద్యోగ సమస్య దేశంలో తీవ్రం అయిందని అన్నారు. అదానీ, అంబానీ ఒక పక్క , పేదలు ఒక పక్క అసమానతలు పెరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బిజెపి మోడీ నుంచి దేశాన్ని కాపాడేందుకు ఈ నెల 15న విజయవాడలో రక్షణ బేరి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ప్రజలు, రైతులు, కార్మికులు, మధ్యతరగతి, ఉద్యోగ ఉపాధ్యాయులు, పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌కోట మండల కేంద్రంతో పాటు సీతంపేట, పోతనపల్లి, సన్యాసి పాలెం, ధర్మవరం, మామిడి, పిల్లి కొట్టం మీదుగా జామి, లక్కవరపుకోట, వేపాడ మండలాల మీదుగా ఆటో జాత ప్రచార కార్యక్రమం నిర్వహించినట్టు మద్దిల రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాడి అప్పారావు, చల్ల జగన్‌, చలికాని ముత్యాలు, ముళ్ళు హర్ష, టి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
వేపాడ: ఈనెల 15న విజయవాడలో జరగనున్న ప్రజా రక్షణ బేరి సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో సభను విజయవంత చేయాలని కోరుతూ విస్తృత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చల్లా జగన్‌, మద్దిల రమణ, గాడి అప్పారావు పాల్గొన్నారు.
గరివిడి: ఈ నెల 15న సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న విజయవాడ బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి అంబళ్ల గౌరినాయుడు కోరారు. మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. డిఎప్‌ఎన్‌ ఫ్యాక్టరీ నుండి గరివిడి తహశీల్దార్‌ కార్యాలయం వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్య దర్శివర్గ సభ్యులు టివి. రమణ, జె.స్వానాథరాజు, శనపతి రమణ, చలపతి పాపినాయుడు, సన్యాసినాయుడు, ఫ్యాకర్‌ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
జామి: భీమసింగి సహకార చక్కెర కర్మాగారం బాధిత రైతాంగ గ్రామాలైన కొట్టాం, విజినిగిరి, తాండ్రంగి, జామి, లాక్కవరపు కోట మండలంలో పలు గ్రామాల్లో ప్రచారం సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఆటో ప్రచార జాతాను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ బీమసింగి సహకార చక్కెర కర్మాగారం మూసివేత తో ఈ ప్రాంత చెరుకు రైతులకు తీవ్ర అన్య్యాయం జరిగిందన్నారు. తక్షణమే ఫ్యాక్టరీ తెరిపించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర ధరలు తగ్గించి ప్రజానీకాన్ని ఆదుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ కోసం తప్ప పేదల కోసం పని చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చల్లా జగన్‌, సిపిఎం నాయకులు మద్దెల రమణ, గాడి అప్పారావు, ముత్యాలు, పాల్గొన్నారు.
లక్కవరపుకోట : ఈ నెల 15న విజయవాడ కేంద్రంగా జరగనున్న ప్రజా రక్షణ బేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన సిపిఎం ఆటో జాత సోమవారం మండలంలోని సోంపురం జంక్షన్‌ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ విద్య, వైద్యం వంటివి ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. అనేక సమస్యలపై విజయవాడ కేంద్రంగా చేయబడుతున్న ప్రజా రక్షణ బేరి కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజానీకం పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాడి అప్పారావు, మద్దిల రమణ, చల్లా జగన్‌, హర్ష పాల్గొన్నారు.
విజయనగరం టౌన్‌ : సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరీ కార్యక్రమానికి ఇంటికో మనిషి విజయవాడ రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు పిలుపు నిచ్చారు. 15న విజయవాడలో లక్షలాది మందితో సిపిఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. సోమవారం రామకృష్ణా నగర్‌, ఎల్‌బిజి నగర్‌లో విస్తృత ప్రచారంలో భాగంగా సభ నిర్వహించారు. వినాయక నగర్‌, అయ్యన్నపేట, తదితర చోట్ల జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు బి. రమణ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ముచ్చెరువు గట్టు పై జిల్లా కమిటి సభ్యులు జగన్‌ మోహన్‌, వి. లక్ష్మి ప్రచారం చేశారు. రెడ్డి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నెలరోజులుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇప్పటికే బస్‌ యాత్ర జయ ప్రదంగా జరిగిందని ఇప్పుడు ఊరు, వాడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని ఛలో విజయవాడను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగదాంబ, శాంత మూర్తి తదితరులు పాల్గొన్నారు.