May 21,2023 16:02
  • రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి పూల భాస్కర్

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : దేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పూల భాస్కర్ తెలియజేశారు. రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూల భాస్కర్ మాట్లాడుతూ దేశ ప్రజలే కాక ప్రతిపక్ష నేతలు కూడా అభిమానించే వ్యక్తి, ప్రపంచం గర్వించదగ్గ సాంకేతికతను భారతదేశానికి అందించినటువంటి మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని తెలిపారు. ఆయన గ్రామ స్వరాజ్య సాధన కోసం పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాడని, స్థానిక సంస్థలలో మహిళలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. వయోజన ఓటు హక్కును 21 సంవత్సరముల నుంచి 18 సంవత్సరాలకు కుదించి యువత హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని తెలియజేశారు. ఆ మహనీయుడు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు శెట్టిపల్లి సన్నీ, మణి, శివ, మురళి తదితరులు పాల్గొన్నారు.