ప్రజాశక్తి-కొత్తవలస రూరల్ : కొత్తవలసలో అధ్వానంగా మారిన రహదారులను బాగు చేయాలని సిపిఎం ఆధ్వర్యాన గురువారం మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ విజయనగరం నుంచి కొత్తవలస వెళ్లే రహదారి భీమాలి వరకు అధ్వానంగా మారిందన్నారు. రోజూ బొగ్గులారీలు తిరగడం వల్ల కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయన్నారు. మరోవైపు రహదారులు సైతం పాడైపోయాయని తెలిపారు. పారిశ్రామిక ప్రయోజనాలు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలను కాలుష్యం బారి నుంచి కాపాడి, 15రోజుల్లో రోడ్లు బాగు చేయకపోతే ప్రజలతో కలిసి రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాడి అప్పారావు, బివి రమణ, గొంప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.