May 13,2022 07:55
  • నానో యూరియాపై దృష్టి
  • 4,200 ప్రాంతాల్లో గోడౌన్లు, కోల్డు రూములు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండువేల రైతు భరోసా కేంద్రాల్లో కిసాన్‌డ్రోన్లు ఏర్పాటు చేసుకోవాలని, దీనికోసం మండలానికి నాలుగు ఆర్‌బికెలను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.16,400 కోట్లతో చేపట్టనున్న అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌బికెల పరిధిలో డ్రోన్‌ పైలట్లను గుర్తించాలని సూచించారు. రైతుల్లో సైన్స్‌ గ్రాడ్యుయేషన్‌, ఇంటర్‌సైన్స్‌ గ్రూపు చదువుకున్న రైతులను గుర్తించాలని అన్నారు. నానో యూరియా వాడకంపైనా దృష్టి పెట్టాలన్నారు. ఉద్యాన పంటలు అధికంగా ఉన్న చోట డ్రై గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. రెండుదశల్లో వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల పనులు యుద్ధప్రాతిపదికన జరగాలన్నారు. ఇప్పటికే 4,200 ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్‌ రూములు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాం కడుతున్నామని అధికారులు సిఎంకు వివరించారు. వెంటనే పనులు మొదలుపెట్టాలని సిఎం ఆదేశించారు. ప్రతి ఆర్‌బికెలో యంత్ర సేవా పథకం ఉండాలని చెప్పారు. త్వరలో అనకాపల్లిలో అమూల్‌ జగనన్న పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభం కానుందని, మొత్తం 191 గ్రామాల్లో పాలసేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో 1282 గ్రామాల్లో ప్రారంభం కానున్న పాలసేకరణ ప్రాధాన్య తాక్రమంలో బిఎంసి యూనిట్లను నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. పాల సేకరణ వెన్నశాతం, నిర్ధారణలో కచ్చితమైన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జగనన్న పాలవెల్లువ ద్వారా ఎస్‌హెచ్‌జి గ్రూపులకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వాఫీడ్‌ రేట్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆక్వా అసిస్టెంట్ల నుండి సమస్యలు నివేదిక రూపంలో తీసుకోవాలని తెలిపారు.
     జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయని అధికారులు వివరించారు. ఫేజ్‌-2లో చేటప్టనున్న బుడగట్టపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, వాడరేవు, కొత్తపట్నం జులైలో ప్రారంభించనున్నట్లు అధికారులు సిఎంకు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎపి అగ్రిమిషన్‌ ఛైర్మన్‌ ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సిఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్థికశాఖ స్పెషల్‌ సిఎస్‌ రావత్‌ తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడుల కోసం
 

                                                     22 నుంచి సిఎం దావోస్‌ పర్యటన

దావోస్‌లో ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. 'ప్రజలు, పురోగతి, అవకాశాలు' అనే నేపథ్యంతో రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను చాటేందుకు తొలి అంతర్జాతీయ పర్యటనకు సిఎం సిద్ధమైనట్లు వెల్లడించారు. పర్యటనకు సంబంధించిన లోగోను పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్‌తో కలిసి సచివాలయంలో గురువారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో వాణిజ్యం, అధునాతన నమూనాలు, గ్లోబల్‌ నెట్‌వర్క్స్‌ ఆఫ్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌, ఎంఎస్‌ఎంఇలను మరింత బలోపేతం చేయడం, నైపుణ్యం, రీసైక్లిల్లింగ్‌ వర్క్‌ఫోర్స్‌, తయారీ, గ్లోబల్‌ పోర్ట్‌ నేతృత్వంలోని అభివృద్ధి, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి అంశాలలో రాష్ట్రం భాగస్వామ్యమవుతుందని తెలిపారు. సిఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దావోస్‌ పర్యటనలో 35 గ్లోబల్‌ కంపెనీలు, ఎంఎన్‌సిలు, ప్రపంచ స్థాయి నాయకులు, మేధావులతో సిఎం శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి సంబంధిత రంగాల్లో అపార పెట్టుబడి అవకాశాలు, రెన్యువబుల్‌ ఎనర్జీ, సాంకేతిక సేవలు, కన్జూమర్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసిజి, లాజిస్టిక్స్‌, కేపిటల్‌ మార్కెట్స్‌, ఆర్థిక పరస్పర సహకార మార్గాలపై చర్చించేందుకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ప్రధానంగా దృష్టి సారించిందని పేర్కొన్నారు. 23వ తేదీన వైద్యరంగంపై, 24న విద్య, నైపుణ్య, 25న డీకార్బనైజ్డ్‌ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశాలు జరుగుతాయని వివరించారు.