- భయాందోళనల్లో ప్రజలు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పల్లెల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ తిరుగుతూ ప్రజలకు నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పందుల గోలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రత్యేకించి కూచివారిపల్లె పంచాయతీ పరిధిలోని డి.బి.ఎన్ పల్లె, ఊటుకూరు పంచాయతీ పరిధిలోని డి.బి.ఎన్ పల్లెల్లో పందులు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మనుషులతో సమానంగా కలిసిపోయి విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. జనావాసాలలో కలిసిపోయి వీరంగం సృష్టిస్తున్నాయి. ఇళ్లల్లోకి వస్తూ గుబుప్స కలిగించే విధంగా పరిసరాలను పాడు చేస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాలలో గత ఐదారు నెలలుగా పందుల గోల మరి విపరీతంగా పెరిగిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. పందులు సృష్టించే గుబుప్సకరమైన వాతావరణానికి పరిసరాలలో ఈగలు, దోమలు ఎక్కువై అంటు వ్యాధులు, విశ్వజ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో మండల వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ఏ ఆసుపత్రికి వెళ్లినా డెంగ్యూ జ్వరాల బాధితులు పదుల సంఖ్యలో ఉంటున్నారు. అంతేకాకుండా పందులు స్వైర విహారం చేస్తూ, రోడ్ల పైన విచ్చలవిడిగా తిరుగుతూ ఊటుకూరు, కూచివారిపల్లె పంచాయతీలలో ద్విచక్ర వాహనాలలో వెళ్లే వారిని పలుమార్లు ప్రమాదాలకు గురి చేశాయి. వాటి కారణంగా ఈ గ్రామాలలో ప్రమాదానికి గురై శస్త్ర చికిత్సలు కూడా చేసుకున్నారని స్థానికులు తెలుపుతున్నారు. పందుల గోల నుంచి తప్పించాలంటూ గ్రామస్తులు కూచివారిపల్లె పంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. పందుల కారణంగా సంక్రమించే అంటువ్యాధులు, సంక్రమిత వ్యాధుల భారి నుంచి తమను కాపాడాలని.. పందుల గోల నుంచి పంచాయతీలను రక్షించాలని., వాటిని తమ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యను పరిష్కరిస్తాం -ఎంపీడీఓ
---------------------------------------------
మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాలముని స్వామిని వివరణ కోరగా సమస్య తన దృష్టికి రాలేదని, పంచాయతీ కార్యదర్శులతో చర్చించి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు.










