ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజారక్షణ భేరి పేరిట సిపిఎం విజయవాడలో బుధవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి ఎర్ర సైనికులు తరలి వెళ్లారు. జిల్లా నుంచి బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో సిపిఎం శ్రేణులు వెళ్లారు. విజయనగరం నుంచి తరలి వెళ్తున్న ఎర్ర సైనికుల బస్సులను సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజారక్షణ భేరి బస్సుయాత్రలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి సిపిఎం నాయకులు చేపట్టారని తెలిపారు. ఈ బస్సు యాత్రలు ముగింపు సందర్భంగా బుధవారం లక్షలాది మందితో విజయవాడలో జరగనున్న బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వెళ్తున్నారని తెలిపారపు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దోపిడీ దారులకు అనుకూలంగా పాలన సాగిస్తున్నారు తప్ప ప్రజలు సంక్షేమం పట్టడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయడం, కార్మిక హక్కులు కాలరాయడం, రైతుల పంటకు గిట్టు బాటు ధర లేకపోవడం, రైతుల భూములు బలవంతంగా లాగేసుకుని కార్పొరేట్లు ధారాదత్తం చేయడం వంటి అరాచక పాలన సాగుతుందన్నారు. ఈ నేపధ్యంలో ప్రజలకు న్యాయం చేసేది, వారికి అండగా ఉండేది, అసమానతలు లేని అభివద్ది కోసం పాటు పడేది సిపిఎం మాత్రమేనన్నారు. ఇటువంటి ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వెళ్తున్న సిపిఎంను ప్రజలంతా బలపర్చాలని కోరారు. బహిరంగ సభలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గపూర్ ప్రసంగిస్తారని తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టివి రమణ, పి.శంకరరావు, ఎ.జగన్మోహన్, పి.రామ్మోహన్ సిపిఎం కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.
బహిరంగ సభకు పలురైళ్లలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
విజయ నగరం నుంచి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, నాయకులు పి.రమణమ్మ, రమణ ఆధ్వర్యాన అధిక సంఖ్యలో సిపిఎం కార్యకర్తలు సొంత ఖర్చులు పెట్టుకొని రైళ్లలో విజయవాడ వెళ్లారు.