చండీఘర్ : ఈ సారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఉవిళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ తరహా వాగ్దానాలను ఇక్కడ కూడా అనుసరిస్తుంది. శనివారం జలంధర్‌లో ర్యాలీలో పాల్గన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ .. తాము అధికారంలోకి వస్తే.. ప్రజలపై ఎటువంటి నూతన పన్నులు మోపమని వాగ్దానాలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే... డోర్ స్టెప్ సర్వీసులు, మహల్లా క్లినిక్‌లు తెస్తామని చెప్పారు. పంజాబ్‌లో 16 వేల క్లినిక్స్‌ను తీసుకువస్తామని, ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు ఆప్‌కు ఐదేళ్ల సమయం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీలో పారిశ్రామిక వేత్తలను బిజెపి ఓటు బ్యాంకుగానే చూసిందని, వారెప్పుడూ తనకు ఓటు వేయలేదని, వారి మనస్సులు గెలుచుకున్న తర్వాత.. తమకు అనుకూలంగా ఓటు వేయడం ప్రారంభించారని అన్నారు. మాకు ఐదేళ్లు సమయం ఇవ్వండని, మీ మనస్సులను కూడా గెలుస్తామని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా బలవంతపు మతమార్పిడిలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని కేజ్రీవాల్ అన్నారు. ' మతం అన్నది వ్యక్తిగత విషయం. ప్రతి ఒక్కరికీ భగవంతున్ని ఆరాధించే హక్కు ఉంది. కానీ ఎవ్వరినీ బలవంతంగా వేధించరాదు. భయపెట్టి చేసే మత మార్పిడిలు తప్పు' అని అన్నారు. 117 అసెంబ్లీ స్థానాలు గల పంజాబ్‌కు వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి.










