పంజాబ్ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఎందుకు ఉంది?
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కాలంలో కరోనా తర్వాత అంతంటి ప్రధాన చర్చనీయాంశంగా మారాయి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు కీలకమైనవి. ఉత్తరప్రదేశ్‌లో తిరిగి పాగా వేయాలని బిజెపి భావిస్తుంటే.. పంజాబ్‌లో కాంగ్రెస్ కూడా అదే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. అయితే ప్రతి పార్టీ కూడా పంజాబ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులను, తమ కేడర్‌లను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నాయి. అయితే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తామని ప్రతి ప్రభుత్వం చెబుతున్నా.. వాటి ఆచరణలో అసాధ్యమౌతోంది. యుపిలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.. మహిళలకు ప్రాధాన్యతనిస్తుండగా.. దీన్ని ఎదుర్కొనేందుకు బిజెపి కూడా మహిళలకు పెద్ద సంఖ్యలో సీట్లను కేటాయించేందుకు సిద్ధపడుతోంది. ఇక పంజాబ్‌లో మహిళల ప్రాధాన్యత అంతంత మాత్రంగానే ఉంది. పంజాబ్‌లో తొలి అసెంబ్లీ ఎన్నికల నుండి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల వరకు కూడా చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యంలో వేగవంతమైన మార్పులేమీ చోటుచేసుకోలేదు. అయితే మెల్లగా రాజకీయాల్లోకి అడుగిడుతున్నారు.
7దశాబ్దాల్లో గణనీయంగా పెరగని మహిళల ప్రాతినిధ్యం
1952లో తొలిసారిగా పంజాబ్‌కు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సుమారు ఏడు దశాబ్దాల తర్వాత జరగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళల ప్రాతినిధ్యంలో పెద్ద మార్పులేమీ చోటుచేసుకోలేదు. దీంతో మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని, వారి ఉనికిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పంజాబ్ యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డా. పంపా ముఖర్జీ తన అభిప్రాయాలను వ్యక్త పరిచారు. 'రాష్ట్రంలో సామాజిక కోణాన్ని అర్థం చేసుకోవాలి. భారత్‌లో ఇతర రాష్ట్రాల మాదిరిగానే పంజాబ్‌లో కూడా ఇప్పటికీ పితృస్వామ్య, భూస్వామ్య విధానాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. కులం, భూస్వామ్య వ్యవస్థ.. ఇక్కడ అధికారాన్ని చేపడతాయి. ఇదే రాజకీయ, సామాజిక నిర్ణయాలు తీసుకునేందుకు కారణమౌతాయి. రాష్ట్రంలోని మహిళలు ఆస్తులు, భూములు లేని మహిళలు..అధికారాన్ని చెలామణి చేసుకోలేరు. అటువంటి వారికి రాజకీయంగా, సామాజికంగా స్థానం లేనట్లే. అయితే రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం.. నేతలుగా రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యమ'ని అన్నారు.
స్థానిక సంస్థల్లో పెరుగుతోన్న స్త్రీలు
పంజాబ్‌లో రాజకీయాల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటారు. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ 2018లో చట్టం చేయడంతో.. అప్పటి నుండి స్త్రీల ప్రాధాన్యత పెరిగింది. పంజాబ్‌లోని పంచాయతీ రాజ్ సంస్థల (పిఆర్‌ఐ)లో ఎన్నికైన మహిళా ప్రతినిధుల సంఖ్య 1,00,312కి గానూ 41,912. ఈ సంఖ్యను చూస్తే 40 శాతం కన్నా ఎక్కువగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇలా ఎన్నికైన మహిళలు.. ఇంట్లో, వెలుపల నిర్ణయాలు తీసుకుంటున్నారని, శాసనసభ్యులుగా వారి ప్రాతినిధ్యం పెరిగిందని, వారి నాయకత్వాన్ని పురుషులు అంగీకరిస్తున్నారని భావించడం అమాయకత్వమే అవుతుంది.
చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళ కేవలం ఆ పాత్ర పోషించడానికే పరిమితమని, నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం తనకు కాదని భారతీయ కిసాన్ యూనియయన్ ఏక్తా ఉఘ్రహన్ మహిళా రైతు నేత హరీందర్ బిందు అన్నారు. ' అసెంబ్లీకి పెద్ద సంఖ్యలో మహిళలు ఎన్నికైనప్పటికీ.. స్వతంత్య్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి మాత్రం ఉండదు. అనుకోకుండా.. ఆమె పురుషాధిపత్య ప్రభావానికి గురువుతూనే ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య, ఉన్నత వర్గ కుటుంబాల్లో ఇదే ధోరణి కనిపిస్తుంది' అని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళల ఓటింగ్ శాతం అధికం. దీని బట్టి చూస్తే అసెంబ్లీలో తమ ప్రతినిధులను ఎన్నుకోవడంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇది బలమైన సూచికని ప్రొఫెసర్ ముఖర్జీ అన్నారు. ఏదైమైనప్పటికీ.. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తాయి. దీంతో మహిళలను ఆకర్షించేందుకు వాగ్దానాలు, పథకాలు, కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాయి. పితృస్వామ్య వ్యవస్థకు అలవాటు పడ్డ రాజకీయ పార్టీలు సైతం.. వాగ్దానాలతో ముంచెత్తుతాయి తప్ప.. వారిని ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సిద్ధపడవని అన్నారు.

ఉనికి ప్రశార్ధకమా..?
1957 నుండి 2017 అసెంబ్లీ ఎన్నికల వరకు మొత్తం 507 మంది మహిళలు పోటీ చేస్తే.. గెలిచింది కేవలం 86 మందే. 2012లో అత్యధికంగా 14 మంది మహిళలు ఎన్నికయ్యారు. 2012లో 67 నియోజక వర్గాల్లో 93 మంది మహిళలు పోటీ చేస్తే గెలుపొందిందీ మాత్రం 14 మంది మాత్రమే. కాగా, ఫిబ్రవరిలో జరగనున్న తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 28 మంది అభ్యర్థులు మాత్రమే పోటీకి దిగుతున్నారు. వారిలో ఆప్ 12 స్థానాల్లో, కాంగ్రెస్ 11, సంయుక్త సమాజ్ మోర్చా ఇద్దర్ని, బిజెపి దాని కూటమి ఎనిమిది మంది, శిరోమణి అకాలీదళ్ ఐదుగురిని బరిలోకి దింపుతున్నాయి. ఈ సంఖ్య చూస్తే గతం కన్నా హీనంగా ఉంది. దీని బట్టి చూస్తే చట్టసభల్లో మహిళల ఉనికి కోల్పోయేటట్లు కనిపిస్తోంది. తమ ఉనికి కాపాడుకోవడం కోసం వారు సుదీర్ఘ పోరాటం చేయాల్సిందే. కొన్ని సార్లు రాజకీయ పార్టీలు మద్దతునిచ్చినా.. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లేకపోవడంతో వెనక్కు తగ్గుతున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఓటర్లుగా మహిళల్లో చైతన్యం వచ్చిందని, ఇటీవల జరిగిన రైతు ఉద్యమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, ప్రశ్నించే తత్వం అలవడిందని ప్రొఫెసర్ షోయబ్ జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓటు వేయడంపై ఆలోచిస్తున్నారని తెలిపారు. పితృస్వామ్య వ్యవస్థ నుండి బయట పడి, వారి స్థానాన్ని పొందేందుకు కొంత సమయం పట్టవచ్చునని అన్నారు. అయితే పంజాబ్‌లో మార్పు దిశగా పయనిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల మాదిరిగానే...చట్ట సభల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.










