Nov 14,2023 21:16

సమావేశంలో మాట్లాడుతున్న జెసి మయూర్‌ అశోక్‌

ప్రజాశక్తి-విజయనగరం :  ఏ ఒక్క రైతు నష్టపోకుండా, అత్యంత పకడ్బంధీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆదేశించారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని, మిల్లర్లను బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. త్వరలో ప్రారంభం కానున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియపై గ్రామ వ్యవసాయ సహాయకులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సహాయకులకు స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో మంగళవారం శిక్షణ నిర్వహించారు. జెసి మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ, సజావుగా ప్రక్రియను నిర్వహించాలని కోరారు. ఎట్టిపరిస్థితిలోనూ దళారులను, మధ్యవర్తులను దరిచేరనీయవద్దని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియ షెడ్యూలింగ్‌ నుంచి రసీదు ఇచ్చేవరకు ఐదు దశల్లో జరుగుతుందన్నారు. తీసుకున్న ధాన్యానికి ఎఫ్‌టిఒ తయారైన తరువాత, ఆ ధాన్యంతో రైతుకు సంబంధం ఉండదని, అక్కడినుంచి ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.
ఇ-క్రాప్‌ ఆధారంగానే ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. రైతులు ఎంత ధాన్యం తెచ్చినా కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది కొన్నిచోట్ల అననుకూల వాతావరణం వల్ల పంట ఎండిపోయిందని, ఇబ్బందికర పరిస్థితి ఉందని జెసి చెప్పారు. ధాన్యం తరలించే ప్రతీ వాహనానికి జిపిఎస్‌ తప్పనిసరి అని స్పష్టం చేశారు. రైతులు తామే గోనె సంచులను, వాహనాలను సమకూర్చుకుంటే, వాటి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. కొనుగోలు పూర్తి అయిన వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులు జమ చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో తాహశీల్దార్లు, ఎఒలను, నియోజకవర్గ స్థాయిలో ఎస్‌డిసిలను ప్రత్యేకాధికారులుగా నియమించినట్లు తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో ఏమైనా సందేహాలు తలెత్తితే, జిల్లా అధికారులను లేదా జిల్లా స్థాయి కాల్‌ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. జిల్లా పౌర సరఫరా అధికారి మధుసూదనరావు, సివిల్‌ సప్లయిస్‌ డిఎం మీనా కుమారి, వ్యవసాయశాఖ జెడి విటి రామారావు, ఉద్యానశాఖ డిడి జమదగ్ని, జిల్లా సహకార అధికారి రమేష్‌, మార్క్‌ఫెడ్‌ డిఎం విమల, ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.