Jan 18,2023 15:01

ప్రజాశక్తి-నిమ్మనపల్లి : విశ్వవిఖ్యాత, నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 27 వ వర్ధంతి ని మండల మాజీ అధ్యక్షులు రెడ్డెప్పరెడ్డి, మండలాధ్యక్షులు వెంకటరమణ, మండల తెలుగుయువత అధ్యక్షులు చిన్నబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలసి నిమ్మనపల్లి, వెంకోజీగారిపల్లిలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకోజిగారిపల్లిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిత్రక సినిమాలతో, నటన చాతుర్యంతో ప్రజల గుండెల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. నేటికి అయనను ప్రజలు దైవసమానంగా కొలుస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నాదన్నారు. ప్రస్తుతం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను మేరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉంటూ వైసిపి వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోయి, రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవటానికి ప్రతి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్.జే వెంకటేష్, టిడిపి నాయకులు మునిరత్నం, సుధాకర్ రావు, మల్లికార్జున, లక్ష్మన్న, చిన్నబాబు, మేష రామకృష్ణ, విజయ్, మురళీమోహన్, దేవేందర్ రెడ్డి, రెడ్డప్ప రెడ్డి, నరేంద్ర, ఖాసిం ఖాన్, చంద్ర, భూపతి, గోపి తదితరులు పాల్గొన్నారు.