- ఇన్ఫోసిస్‌ను ప్రారంభిస్తూ సిఎం జగన్ ప్రకటన
- ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటానంటూ ఐటి కంపెనీలకు భరోసా
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో, అనకాపల్లి ప్రతినిధి : 'ఈ ఏడాది డిసెంబరులోగా విశాఖకు షిఫ్టు అవుతాం. నా నివాసం కూడా ఇక్కడే. మా అధికారులు వారి కార్యాలయాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగమయ్యారు' అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. విశాఖపట్నం ఐటి హిల్స్‌లో నిర్మితమైన ఇన్ఫోసిస్ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నరు తరహాలో ఐటి రంగంలో విశాఖకు అన్ని అర్హతలూ, సామర్థ్యం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం ఐటి సేవలకు ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. గతంలో అన్ని ఐటి సంస్థలనూ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారన్నారు. విశాఖలో ఇప్పటికే ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయన్నారు. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, ఎనిమిది యూనివర్సిటీలు, నాలుగు మెడికల్, 12 డిగ్రీ కాలేజీలతో ఎడ్యుకేషన్ హబ్‌గా విశాఖ ఉందని పేర్కొన్నారు. ఏటా ఇక్కడి నుంచి 12 వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు బయటకొస్తున్నారన్నారు. ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ వంటి సంస్థలూ, ఐఒసి ఇక్కడే ఉన్నాయని వివరించారు. సుమారు 20 వేల నేవల్ అధికారుల కుటుంబాలతో ఈస్టర్న్ నేవల్ కమాండ్ (ఇఎన్‌సి), ప్రభుత్వ రంగ సంస్థలూ ఉన్నాయన్నారు. ప్రతిష్టాత్మక వైజాగ్ పోర్టు, గంగవరం పోర్టు ఇక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. కొత్తగా శ్రీకాకుళం జిల్లాలో పోర్టు రాబోతుందన్నారు. రెండేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
మరిన్ని ఐటి కంపెనీలు విశాఖకు...
టయర్ వన్ నగరంగా ఎదగడం ఐటి కంపెనీలతోనే సాధ్యమని, ఇన్ఫోసిస్ ఇప్పుడు వచ్చిందని, మరిన్ని కంపెనీలు విశాఖ ఐటి జాబితాలో చేరనున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. వెయ్యి మందితో ఇక్కడ ఇన్ఫోసిస్ ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించనుందని తెలిపారు. రెండేళ్లలో అదానీ డేటా సెంటర్ కూడా అందుబాటులోకి రానుందని, క్లౌడ్ కంప్యూటరింగ్‌తోపాటు ఇంటర్నెట్ కేబుల్ మనకు సింగపూర్ నుంచి ప్రత్యేకంగా వస్తుందన్నారు. ఐటి సంస్థల ప్రతినిధులవైపు చూస్తూ... 'మీకు మరోసారి హామీ ఇస్తున్నా ఏ అవసరం ఉన్నా... మేం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం. మీ అవసరాలకు అండగా నిలబడతాం' అంటూ సిఎం భరోసా ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, విడదల రజని, విశాఖ ఎంపి ఎంవివి.సత్యనారాయణ, ఇన్ఫోసిస్ ప్రతినిధులు నిలంజన్‌రారు (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్), నీలాద్రిప్రసాద్ మిశ్రా (వైస్ ప్రెసిడెంట్), మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టిటిడి మాజీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున, జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఫార్మాసిటీలో ప్రారంభోత్సవాలు
అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియో స్టెరైల్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీని, అచ్యుతాపురం ఎపి సెజ్‌లో లారస్ ల్యాబ్స్ యూనిట్-2 ఫార్ములేషన్ బ్లాక్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రూ.300.78 కోట్లతో నిర్మించిన స్టెరైల్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఫార్మా, బయోటెక్ యూనిట్ల ద్వారా 800 మందికి, రూ.421.70 కోట్లతో నిర్మించిన లారస్ యూనిట్ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి అమర్‌నాథ్, ఎంపి డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యేలు అదీప్‌రాజు, యువి.రమణమూర్తిరాజు, పాల్గొన్నారు.
ఎక్కడికక్కడ నిర్బంధం
సిఎం పర్యటన నేపథ్యంలో ఉద్యమకారులు, ప్రతిపక్ష నేతలపై పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. ఎన్‌ఎఒబి, పరవాడ ఫార్మా, అచ్యుతాపురం సెజ్ నిర్వాసితుల సమస్యలపైనా, కాలుష్య సమస్యలు, పరిశ్రమల్లో ప్రమాదాలు, వేతన సమస్యలపైనా సిఎంకు వినతిపత్రాలు ఇవ్వకుండా సిపిఎం నాయకులను పోలీసులు అనకాపల్లి జిల్లాలో గృహ నిర్బంధం చేశారు. కొప్పాకలో నివాసముంటున్న సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావును గృహనిర్బంధంలో ఉంచారు. తాడి గ్రామాన్ని వేరొకచోటుకు తరలించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ, ఆ గ్రామస్తుడు గోవింద్ గ్రామస్తులతో కలిసి బయలుదేరుతుండగా వారిద్దరినీ అరెస్టు చేసి సబ్బవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న సిపిఎం నాయకులను అచ్యుతాపురం జంక్షన్‌లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వారు అక్కడ నిరసన తెలిపారు. వీరిని అచ్యుతాపురం పోలీసు స్టేషన్‌లో ముఖ్యమంత్రి వెళ్లిపోయే వరకు నిర్బంధించారు. రాంబిల్లిలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శివాజీని గృహనిర్బంధం చేశారు. విశాఖలో సిఐటియు జిల్లా కార్యదర్శి పి.మణిని, సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టివి.కృష్ణంరాజును గృహ నిర్బంధంలో ఉంచారు. టిడిపి, జనసేన నేతలనూ పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. అక్రమ అరెస్టులను సిపిఎం విశాఖ, అనకాపల్లి జిల్లా కమిటీలు ఖండించాయి.










