Dec 15,2022 21:17

ఆర్‌డిఒకు వినతి పత్రం అందజేస్తున్న సంఘం నాయకులు

రాజంపేట అర్బన్‌ : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డివిజన్‌ అధ్యక్షులు భుజంగరావు పేర్కొన్నారు. గురువారం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో వీఆర్వోలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం డివిజన్‌ అధ్యక్షులు మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగా మతి చెందిన గ్రామ రెవెన్యూ అధికారుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని అన్నారు. సర్వేకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని, నిబంధనలు సడలించి ఒత్తిడి తగ్గించాలని తెలిపారు. విఆర్‌ఎ నుంచి గ్రేడ్‌ -2 విఆర్‌ఒలుగా పనిచేస్తున్న 3795 మంది గ్రామ రెవెన్యూ అధికారులను వెంటనే ప్రొఫెషన్‌ డిక్లేర్‌ చేసి పేస్కేలు అమలు చేయాలని కోరారు. విఆర్‌ఒలకు సచివాలయ విధులు ఎక్కువగా ఉన్నందున వారికి కావాలసిన కంప్యూటర్‌ సిస్టంతో పాటు స్టేషనరీ ఏర్పాటు చేయాలని కోరారు. సెలవులు, పండగ రోజూల్లో పని కల్పించకుండా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. అప్‌గ్రేడ్‌ చేసిన పోస్టుల స్థానంలో అర్హులైన వీఆర్వోలను ఎంఆర్‌ఐలుగా నియమించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను అర్హులైన వీఆర్‌ఏలతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆర్డిఓ కోదండరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ార్యక్రమంలో వీఆర్వో సంఘం డివిజన్‌ కార్యదర్శి రాఘవేంద్ర, మల్లికార్జున, సోమశేఖర్‌ రెడ్డి, బాషా పాల్గొన్నారు.