Oct 16,2020 07:12

నవంబర్‌ 26న ఒక రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల జాతీయ కార్మిక సదస్సు పిలుపునిచ్చింది. యూనియన్లలో ఉన్నా, లేకున్నా సంఘటిత రంగమైనా, అసంఘటిత రంగమైనా, అనుంబంధమైనా లేదా స్వతంత్ర సంఘమైనా యావత్‌ కార్మిక వర్గం సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు, దేశ వ్యతిరేకమైన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజలంతా ఐక్య పోరాటాన్ని ముమ్మరం చేయాలని అక్టోబర్‌ 2న గాంధీ జయంతి నాడు జరిగిన ఆన్‌లైన్‌ జాతీయ సదస్సు విజ్ఞప్తి చేసింది.
మోడీ నేతృత్వంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో పాటు, బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు...దేశంలోని కార్మికులు, రైతులు, సాధారణ ప్రజల ప్రాథమిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులపై...కరోనా నేపథ్యంలోనూ చేస్తున్న దాడిని సదస్సు ఏకగ్రీవంగా ఖండించింది. బిజెపి రెండవసారి కేంద్రంలో అధికారం చేపట్టాక కార్పొరేట్ల అనుకూల పాలనను ముమ్మరం చేసింది. బిజెపి అనుసరించిన విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా మందగించింది. సాధారణ ప్రజలు, కార్మికులు, రైతులను కరోనా కాలంలోనూ ఆదుకోకపోగా కార్పొరేట్లు ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తోంది. అకస్మాత్తుగా, ఎటువంటి ప్రణాళిక లేకుండా సాగించిన లాక్‌డౌన్‌ వల్ల 40 కోట్ల మంది కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. దాదాపు 12 కోట్ల మంది వలస కార్మికులు ఉపాధి లేక, ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగృహాలకు కాలిబాట పట్టాల్సిన దుస్థితి ప్రభుత్వం వల్లే దాపురించింది. భవన నిర్మాణం, హమాలీ, ఆటో, లారీ, తదితర ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు సిబ్బంది, షాపులు, హోటళ్లు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు తదితర అసంఘటిత రంగ కార్మికులు పూట గడవక ఇబ్బందులు పడ్డారు. కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం, ఉపాధి కోల్పోవడం జరిగింది. ప్రభుత్వోద్యోగుల వేతనాలలో కోత, డి.ఎ స్థంభన, ముందస్తుగా పదవీ విరమణ చేయించడానికైనా పాత ఆదేశాలను ముందుకు తేవడం తదితర చర్యలకు బిజెపి ప్రభుత్వం పాల్పడింది.
ప్రజానీకం కరోనా వల్ల తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంటే పట్టించుకోని ప్రభుత్వం మరో పక్క పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చింది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లేనప్పుడు అప్రజాస్వామికంగా మూడు కార్మిక వ్యతిరేక కోడ్‌లను ఆమోదించింది. బానిసత్వ పరిస్థితులను కార్మికులపై విధించడానికే ఈ కోడ్‌లు రూపొందించబడ్డాయి. వీటి వల్ల యూనియన్ల ఏర్పాటు కష్టతరం చేసింది. సమ్మె చేసే హక్కును వాస్తవంలో తీసివేసింది. అంతర రాష్ట్ర వలస కార్మికులు సమాన పనికి సమాన వేతనం, నివాస సౌకర్యం, ఉచిత ఆరోగ్య సౌకర్యం కోల్పోతారు. దాదాపు 75 శాతం కార్మికులు చట్టపరిధి నుండి తొలగించబడ్డారు. బోనస్‌ సీలింగ్‌ను నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. హైర్‌ అండ్‌ ఫైర్‌ విధానాల అమలు, శాశ్వత ఉద్యోగాలు కనుమరుగు అవుతాయి. అత్యధిక కార్మికులు చట్టాల పరిధి నుండి దూరమవుతారు.
ప్రజల సొమ్ముతో ప్రారంభించి లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇన్సూరెన్స్‌, బ్యాంకులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టు అండ్‌ డాక్స్‌, బొగ్గు గనులు, బిఎస్‌ఎన్‌ఎల్‌, 41 రక్షణ రంగ ఫ్యాక్టరీలు, ఎయిర్‌ ఇండియా తదితర సంస్థల ప్రైవేటీకరణకు, 100 శాతం ఎఫ్‌డిఐ లకు పూనుకుంది. కరోనా విధుల్లో ఉన్న వారిని ఒక పక్క 'ఫ్రంట్‌లైన్‌ వారియర్లు' అంటూ మరోపక్క కరోనా విధుల్లో ఉన్నవారికి రక్షణ, బీమా సౌకర్యాలు కల్పించడం లేదు. వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, ఆశాలు, అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా వారికి అందించాల్సిన రక్షణ విషయంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి.
కరోనా నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి అన్ని పార్లమెంటరీ, రాజ్యాంగ పద్ధతులను ఉల్లంఘిస్తూ 3 వ్యవసాయ బిల్లులను ఆమోదించింది. వీటి ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఊసే లేకుండా కాంట్రాక్టు, కార్పొరేట్‌ వ్యవసాయం, విదేశీ మరియు దేశీయ పెద్ద ఆహార ప్రాసెసింగ్‌ రిటైల్‌ గుత్తాధిపత్యాలను ప్రోత్సహించింది. నిత్యావసర సరుకుల చట్టానికి తూట్లు పొడిచింది. తద్వారా దేశ ఆహార భద్రతకూ ముప్పు వాటిల్లనుంది. రాష్ట్రాలకు, ప్రజలకు నష్టం కలిగించేలా విద్యుత్‌ సవరణ బిల్లు-2020ను పార్లమెంట్‌లో చర్చించకుండా, 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించినా విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్క్‌ను ప్రైవేటీకరించడం ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర ప్రదేశ్‌ విద్యుత్‌ రంగంలోని అన్ని సంఘాల ఉద్యోగులు, ఇంజినీర్లు నిరవధిక విధుల బహిష్కరణకు సన్నద్ధం అవుతున్నారు. దేశ భద్రత కోసం డిఫెన్స్‌ ఉద్యోగులు అక్టోబర్‌ 12 నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. బొగ్గు గనుల కార్మికులు 3 రోజుల నిరవధిక సమ్మె నిర్వహించారు. రైల్వే ఉత్పత్తి యూనిట్ల కార్మికుల ప్రదర్శనలు, బిపిసిఎల్‌ కార్మికుల 2 రోజుల సమ్మె, ఆర్టీసి, చమురు, ఉక్కు, పోర్టు, సిమెంట్‌, స్కీం, తదితర రంగాల కార్మికులు ఆందోళన బాట పట్టారు. సిఐటియు తదితర కార్మిక సంఘం, రైతుసంఘం, కౌలురైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలోనూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు.
మన రాష్ట్రంలోనూ ఇప్పటికే వివిధ రంగాల ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఆందోళనల బాటలో ఉన్నారు. వ్యవసాయ మోటార్లకు నీటిమీటర్లు బిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆందోళనలు నిర్వహించారు. భవన నిర్మాణ రంగం, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, మున్సిపల్‌, పంచాయతీ, బేవరేజెస్‌ హమాలీలు, సివిల్‌ సప్లయిస్‌ హమాలీలు, విద్యుత్‌, ప్రైవేటు విద్యాలయాల సిబ్బంది, ఆటో, ప్రైవేటు రవాణా తదితర రంగాల్లో ఆందోళనలు, సమ్మెలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొత్తం కార్మికవర్గం ఐక్యంగా నవంబర్‌ 26న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని, ఈలోపు విస్తృతంగా కార్మిక వర్గంలో ప్రభుత్వ దుర్మార్గపు విధానలపై ప్రచారం నిర్వహించాలని జాతీయ కార్మిక సదస్సు తీర్మానించింది. సమస్యల పరిష్కారానికై మొత్తం కార్మికవర్గం...ప్రభుత్వ విధానాలపై ధిక్కరణ, సహాయ నిరాకరణ రూపంలో సమ్మె జరగాలని సదస్సు పిలుపునిచ్చింది. శ్రామిక ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల మధ్య బలమైన సంఘీభావం ఏర్పడి భవిష్యత్‌ సుదీర్ఘ పోరాటాలకు నవంబర్‌ 26 సార్వత్రిక సమ్మె నాంది కావాలి.
డిమాండ్లు ఇవి
ఆదాయ పన్ను పరిధి లోని అన్ని కుటుంబాలకు నెలకు రూ.7,500 నగదు బదిలీ. నిరుపేదలందరికీ నెలకు మనిషికి 10 కేజీల రేషన్‌, నిత్యావసర సరుకుల ఉచిత పంపిణీ. గ్రామీణ ప్రాంతాల్లో 200 రోజుల ఉపాధి హామీ పనిని మెరుగైన వేతనాలతో కల్పించాలి. అన్ని రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక కోడ్‌లు ఉపసంహరించాలి. ఆర్థిక రంగంతో సహా ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలి. రైల్వే, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు, పోర్టులు వంటి ప్రభుత్వ నిర్వహణ సేవా సంస్థల కార్పొరేటీకరణ ఆపాలి. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల బలవంతపు అకాల పదవీ విరమణ సర్క్యులర్‌ ఉపసంహరించుకోవాలి. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు, సామాజిక భద్రత. అందరికీ పెన్షన్‌, సిపిఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ పునరుద్ధరణ, ఇపిఎస్‌-95 మెరుగుదల చేయాలి.
(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర కోశాధికారి)