- విజయసాయి కొనసాగింపు
- అదానీ కోసం ఒకటి
- బీద మస్తాన్‌రావు, వైవి సుబ్బారెడ్డికి ఛాన్స్
- రాజ్యసభ స్థానాలపై వైసిపి కసరత్తు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజ్యసభకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యుల పదవీకాలం వచ్చే జూన్ నెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో అధికార వైసిపిలో పార్లమెంటుకు వెళ్లాలనుకునే ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. వైసిపి తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి, టిడిపి నుంచి రాజ్యసభకు వెళ్లి ఆ తర్వాత బిజెపి పంచన చేరిన సుజనాచౌదరి, టిజె వెంకటేష్, బిజెపికి చెందిన సురేష్‌ప్రభు పదవీకాలం పూర్తికానుంది. ఇదివరకే రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేష్ అంబానీ కోరిక మేరకు పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానిని రాజ్యసభకు పంపిన వైసిపి, ఈ దఫా అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీకి ఒక సీటును కేటాయించనున్నట్లు తెలిసింది. ఖాళీ అవుతున్న నాలుగుస్థానాల్లో ఒక్క స్థానాన్ని అదానీ భార్యకు కానీ, లేదా ఆయన సూచించే వారికి కానీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందని వైసిపి వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ అధిపతులతో పాటు, జాతీయస్థాయి నాయకుల నుంచి కూడా రాజ్యసభ సీట్ల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వద్దకు ప్రతిపాదనలు వస్తున్నట్లు సమాచారం. జగన్ ఈ నెలలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారని, ఆ లోగానే రాజ్యసభకు ఎవరిని పంపాలనే విషయంలో ఒక నిర్ణయానికి వస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ స్థానాలపై అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలిసింది. విజయసాయి రెడ్డి : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అనుబంధ ప్రజాసంఘాల బాధ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత వి విజయసాయిరెడ్డిని తిరిగి రాజ్యసభకు పంపే అవకాశముంది. రాజ్యసభలో పార్టీ తరపున వ్యూహాప్రతివ్యూహాలకు సీనియర్ నేత అవసరమని, అందువల్ల ఈ దఫా కూడా విజయసాయికి అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
బీద మస్తాన్‌రావు : వెనుకబడిన తరగతుల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి వివిధ వ్యూహాలు రచిస్తున్న వైసిపి ..పెద్దల సభలోనూ ఈ దపా బిసిలకు అవకాశమిస్తే బావుంటుందని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా నాలుగింటిలో ఒక స్థానాన్ని బిసిలకు కేటాయించి ఆ స్థానానికి యాదవ సామాజిక తరగతికి చెందిన పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌రావును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తద్వారా బిసిలకు తాము పెద్దల సభలో కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చునని భావిస్తోంది.
వైవి సుబ్బారెడ్డి : తిరుమల తిరుపతి దేవస్థానములు (టిటిడి) ధార్మిక సంస్థ ఛైర్మన్‌గా తనదైన శైలిలో పనిచేస్తున్న వైవి సుబ్బారెడ్డికి ఈ సారి రాజ్యసభకు అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఆయనను రాజ్యసభకు పంపితే స్థానికంగా ప్రభావం ఎలావుంటుందనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రస్త్తుతం ఆయన నిర్వహిస్తున్న టిటిడి ఛైర్మన్ పదవిని ఇతరులకు కేటాయించాలా లేదా అటు రాజ్యసభ సభ్యునిగానూ, ఇటు టిటిడి ఛైర్మన్‌గానూ ఆయననే కొనసాగించాలా అనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది.
బరిలో వీరు కూడా : పెద్దల సభలో బెర్తు కోసం వీరితో పాటు మరికొందరు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీరిలో మర్రి రాజశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రివర్గంలో స్ధానం కల్పిస్తామని రాజశేఖర్‌కు గతంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చిన సంగతి విదితమే. వివిధ సామాజిక సమీకరణల సర్దుబాటులో ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌కు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించాలిన భావిస్తున్నట్లు తెలిసింది. ఈ దిశగా ఆయన కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని వినిపి స్తోంది. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపార వేత్త కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తుట్లు తెలిసింది.










