కరోనా ఉధృతి కొంత తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ముప్పు ఇంకా పొంచే ఉంది. ఏ మాత్రం ఆదమరిచినా వైరస్ కాటు వేసే అవకాశం ఉంది. అనేక దేశాల అనుభవం చెబుతున్నది ఇదే! మన రాష్ట్రంతో పాటు, అనేక ఇతర రాష్ట్రాల్లోనూ కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుండటంతో పాటు, వ్యాక్సిన్ వచ్చేస్తోందంటూ వస్తున్న వార్తలు ప్రజానీకంలో ఉదాసీనతకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ల వంటి సాధారణ భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రైళ్లు, బస్సుల్లో భౌతిక దూరం నిబంధన అమలును మానివేశారు. వయో పరిమితి నిబంధన ఎప్పుడో అటకెక్కింది. ప్రయాణ సాధనాలతో పాటు, బహిరంగ ప్రదేశాలు, వివిధ పని ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనల అమలు పర్యవేక్షణ జరగడం లేదు. మాస్కులు పెట్టుకోకుండా రోడ్ల మీదకు వస్తే జరిమానాలు వేస్తామంటూ చేసిన హెచ్చరికలు మాటలకే పరిమితమయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్శిళ్లకే అనుమతి ఇచ్చినప్పటికీ సాధారణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే తెరుచుకున్న విద్యా సంస్థల్లోనూ నిబంధనలు సరిగ్గా పాటించడం లేదంటూ వార్తలు వచ్చాయి. కోవిడ్ నిబంధనల అమలులో ప్రభుత్వాలు చూపుతున్న ఈ నిర్లక్ష్యం సాధారణ ప్రజానీకంలో ఉదాసీనతను మరింత పెంచుతోంది.
శీతాకాలంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికలను నిపుణులు ఎప్పటి నుండో చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అమెరికాతో పాటు అనేక యూరప్ దేశాల్లో రెండవ సారి కరోనా ఉధృతంగా విరుచుకు పడుతుండటంతో లాక్‌డౌన్‌ల బాటను పడుతుండటం చూస్తున్నాం. మన దేశంలోనూ కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం రెండవ విడత లోనూ తీవ్రంగా ఉంది. మన రాష్ట్రం లోనూ పాఠశాలలు తెరిచిన తరువాత పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఒకే రోజు 32 శాతం పెరుగుదల నమోదైంది. కొద్ది రోజులుగా ప్రతి రోజు 30 వేలకు దిగువగా నమోదైన కేసులు రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. మన రాష్ట్రం లోనూ వెయ్యికి తక్కువగా ఒకరోజు కేసులు నమోదైనప్పటికీ అదే పరిస్థితి ఆ తరువాత రోజుల్లో కనపడలేదు. ఇవన్నీ పొంచి ఉన్న ముప్పునకు సంకేతాలే!
ఇక వ్యాక్సిన్‌కు సంబంధించిన ఆశలు, అంచనాలు ఎలా ఉన్నప్పటికీ ఇప్పటివరకు జరుగుతున్నవి పరిశోధనలు, పరీక్షలు మాత్రమే! అవన్నీ పూర్తయి పూర్తి స్థాయిలో విశ్వసనీయమైన వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటు లోకి వస్తుందన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. వచ్చిన తరువాత కూడా 130 కోట్ల మంది ప్రజానీకానికి ఎలా అందించాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. కమిటీలను వేసుకోవాలని రాష్ట్రాలను సూచించడం మినహా నిధులకు సంబంధించి కసరత్తు చేసిన దాఖలాలు లేవు. 80 వేల కోట్ల రూపాయలు అవసరమౌతాయంటూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సిఇఓ చేసిన ప్రకటనను ఖండించడం మినహా కేంద్రం చేసిన కసరత్తేమిటో ఎవరికీ తెలియదు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం వంటి చర్యలు వైరస్ వ్యాప్తిని అడ్డుకోనట్టే, వ్యాక్సిన్ విషయం లోనూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజలకు భద్రత ఇవ్వదు. కరోనా నుండి ప్రజలను రక్షించే బాధ్యత తన మీదే ప్రధానంగా ఉందన్న వాస్తవాన్ని మోడీ ప్రభుత్వం గుర్తించడం లేదు. కార్పొరేట్ల సేవలో మునిగి తేలుతూ ప్రజారోగ్యం పట్ల తన బాధ్యతను విస్మరిస్తోంది. దీనిని ప్రజలు క్షమించరు. కరోనా ముప్పు వలన పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వైరస్ నివారణకు తగినంతగా స్పందించడం లేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలను, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలను, సేవా సంస్థలను ఈ కృషిలో భాగస్వామ్యం చేయాలి. నూరు శాతం పారదర్శకతను పాటించాలి. ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని అందించాలి. అప్రమత్తతే అతి పెద్ద ఆయుధం. ప్రజలందరికి వ్యాక్సిన్ అందేవరకు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి.










