ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో
వాయుగుండం ప్రభావంతో ఈ నెల 12న తెన్నేటి తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ కార్గో నౌకను తరలించేందుకు విశాఖ పోర్టు ఏర్పాట్లు చేస్తోంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవి మా నౌక క్వార్టైజ్‌ను మోంగ్లా పోర్టుకు తీసుకువెళ్లేందుకు యాంకరేజ్‌లో ఉండగా, 12న అర్ధరాత్రి సమయంలో సముద్రంలో వీచిన ఈదురు గాలుల ధాటికి షిప్ యాంకర్ చైన్ తెగిపోవడంతో తెన్నేటి పార్క్ సమీపంలోకి కొట్టుకొచ్చింది. ఈ షిప్‌లో 41 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్ ఆయిల్, 9 మెట్రిక్ టన్నుల డీజిల్ అయిల్ ఉంది. ఇదే విషయాన్ని షిప్ యజమానికి తెలియజేసి, ఈనెల 13న షిప్‌లోని ఆయిల్‌ను తీసేందుకు మెస్సర్స్ ఎంఎస్ గిల్ మెరైన్‌కు బాధ్యతలు అప్పగించారు. గిల్ మెరైన్ ఆయిల్‌ను తీసేందుకు అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వ సంస్ధల నుంచి తీసుకుంది. ఐతే షిప్ ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో తాత్కాలికంగా ఒక రోడ్డును నిర్మించడం జరిగింది. షిప్ వద్ద పనులు చేపట్టేందుకు అవసరమైన మనుషులను సామాగ్రిని తరలించేందుకు వీలుగా ఈ తాత్కాలిక రోడ్డును నిర్మించారు. షిప్ చుట్టూ ఎటువంటి ఆయిల్ లీకేజీ లేకుండా చూసేందుకు విశాఖ పట్నం పోర్టు ట్రస్టు నుంచి అవసరమైన సుశిక్షితులైన సిబ్బందిని పరికరాలను పంపించింది. షిప్ నుంచి ఆయిల్‌ను తొలగించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. షిప్‌లోని ఆయిల్‌ను తీసి వేసిన తరువాత షిప్‌ను తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం షిప్ యజమాని ఎంఎస్ రిసాల్వ్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటి వరకూ షిప్‌లోనికి నీరు చేరడం గానీ, షిప్ నుంచి ఆయిల్ లీకేజీ వంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. బంగ్లాదేశ్ కు చెందిన 15 మంది సిబ్బంది ఇప్పటికీ షిప్‌లోనే ఉన్నారు. షిప్‌లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఎంఎస్ గిల్ మెరైన్ సంస్ధ ఒక జనరేటర్‌ను ఏర్పాటు చేసింది.










