Dec 18,2020 07:46

  వివిధ అంతర్జాతీయ సూచికలు, పోలికల్లో మన దేశ స్ధానం గౌరవ ప్రదమైనదిగా లేనప్పటికీ మన ప్రధాని, బిజెపి నేతలు...ప్రపంచంలో దేశ ప్రతిష్టను పెంచామని పదే పదే చెప్పుకుంటున్నారు. మనం సాధించామని చెబుతున్న ప్రచారానికి విశ్వసనీయత చేకూర్చే ఆధారాలు ఎక్కడా కనిపించటం లేదు. అది యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలన లోనూ...ఆ యాభై ఏళ్లలో చేయలేని దానిని ఐదేళ్లలో చేసి చూపించామని చెప్పుకొనే బిజెపి ఏలుబడి లోనూ కనిపించటం లేదు. అప్పుడూ ఇప్పుడూ అసలు సమస్యల నుంచి జనాన్ని పక్కదారి మళ్లించే నినాదాలు, చర్యలు మాత్రమే కనిపిస్తున్నాయి.
    నరేంద్రమోడీ ఏలుబడిలో దేశ అభివృద్ధి, ఇతర అనేక సూచికల విషయంలో పెరుగుదల లేకపోగా వెనక్కు పోతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. అన్నింటికీ కాంగ్రెసే కారణం చెప్పుకొనేందుకు ఇంకే మాత్రం అవకాశం లేని విధంగా సూచికలు దర్శనమిస్తున్నాయి. మీరు చేసింది ఏమిటో చెప్పమని అడిగే రోజులు ప్రారంభమయ్యాయి. తాజా విషయానికి వస్తే 2019 ప్రపంచ దేశాల మానవాభివృద్ధి సూచికలను డిసెంబరు 15న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీని ప్రకారం 189 దేశాలలో మన స్ధానం 130 నుంచి 131కి పడిపోయింది. 2014 నుంచి చూస్తే 132-129 మధ్యనే ఉన్నది. 'అభివృద్ధిలో మనతో పోటీ పడుతోంది' అని కొందరు వర్ణించే చైనా ర్యాంకు 97 నుంచి 85కు పెరిగింది. మన బిజెపి నేతలు నిత్యం స్మరించే లేదా పోల్చుకొనే పాకిస్తాన్‌ ర్యాంకు 156 నుంచి 154కు పెరిగింది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌ ర్యాంకు 141 నుంచి 133కు పెంచుకుంది. ఈ లెక్కన బంగ్లాదేశ్‌ మానవాభివృద్ధిలో మనల్ని వెనక్కు నెట్టేందుకు ఎక్కువ కాలం పట్టదు. మన యంత్రాంగం అందించిన గణాంకాలనే పరిగణన లోకి తీసుకొని ఐక్యరాజ్యసమితి ఈ సూచికలను నిర్ణయిస్తుంది కనుక లెక్కల్లో తేడా అంటే కుదరదు.
      ప్రస్తుతం మానవాభివృద్ధి సూచికల్లో ఆయా దేశాల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ప్రతిబింబిస్తున్నాయి. తాజా నివేదిక కరోనాతో నిమిత్తం లేని 2019వ సంవత్సరానిది. కరోనా ప్రభావం ఏ దేశాన్ని ఎక్కడ వుంచుతుందో చూడాల్సి వుంది. దానితో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న అంశాలను తీసుకొని మనం ఎక్కడ వున్నామో, పాలకులు మనలను ఎక్కడ ఉంచారో ఒకసారి అవలోకిద్దాం. 2018లో పిపిపి ప్రాతిపదికన మన తలసరి జాతీయ ఆదాయం 6,829 డాలర్లు కాగా 2019లో అది 6,681 డాలర్లకు పడిపోయింది. ఐక్యరాజ్యసమితి లోని 189 దేశాలను మానవాభివృద్ధిలో నాలుగు తరగతులుగా విభజించారు. వాటిలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలుగా 0.957 - 0.804 పాయింట్ల మధ్య వున్న 66, అభివృద్ధి చెందినవిగా 0.796 - 0.703 ఉన్న దేశాలు 53, మధ్య తరహా దేశాలలో 0.697-0.554 పాయింట్ల మధ్య వున్నవి 37, అంతకంటే తక్కువగా ఉన్న దేశాలు 33 వున్నాయి. వీటిలో మన దేశం మూడవ జాబితాలో వుంది. మనతో పాటు మన కంటే ఎగువన భూటాన్‌, దిగువన వరుసగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, పాకిస్తాన్‌ వున్నాయి. మనకంటే ఎగువన అభివృద్ధి చెందిన దేశాలలో శ్రీలంక, చైనా ఉన్నాయి.
      2000 సంవత్సరంలో ప్రణాళికా సంఘం విజన్‌ 2020 పేరుతో ఒక పత్రాన్ని రూపొందించి అభివృద్ధి ఎలా ఉండాలో, ఉంటుందో పేర్కొన్నది. ఈ ఇరవై సంవత్సరాలలో వాజ్‌పేయి హయాంను కూడా కలుపుకుంటే బిజెపి ఏలుబడి పది సంవత్సరాలు, కాంగ్రెస్‌ వాటా పదేళ్లు ఉంది. ఈ శతాబ్ది ప్రారంభంలో అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పిందేమిటి? రానున్న రెండు దశాబ్దాల కాలంలో జిడిపి వృద్ధి రేటు 8.5-9 శాతం మధ్య ఉంటుంది. దీంతో దారిద్య్రం పూర్తిగా తొలగిపోతుంది. ఎగువ మధ్య తరగతి జాబితా లోకి దేశం వెళుతుంది. ఇవేవీ నిజం కాలేదు. జనాభా పెరుగుదల గురించి వేసిన అంచనాలు మాత్రమే నిజమయ్యాయి. ఈ రెండు దశాబ్దాలలో ఉపాధి రహిత అభివృద్ధి మాత్రమే నమోదైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందేందుకు నైపుణ్యం కలిగిన 50 కోట్ల మంది కార్మికులు కావాలని చెప్పారు. రెండు వేల సంవత్సరంలో నైపుణ్యం కలిగిన యువకులు రెండు శాతం ఉంటే 2019 నాటికి 4.4 శాతానికి మాత్రమే పెరిగింది. అందరికీ ఉద్యోగాలు అన్న నినాదం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పెద్ద నోట్ల రద్దు, తగిన కసరత్తు లేని జిఎస్‌టి అమలు వలన కోటీ పది లక్షల ఉద్యోగాలు పోయాయి.
    విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇంకా ఎంత కాలం, రద్దు చేయాలని కోరేవారు పెరుగుతున్నారు. గిరిజనులకు సంబంధించి జనాభాలో వారు ఎనిమిది శాతం ఉన్నప్పటికీ టీచర్లలో వారు 2.3 శాతానికి మించి లేరు. నాణ్యమైన విద్య ఒక అంశమైతే మన జనాభాకు తగిన విధంగా విశ్వవిద్యాలయాలు పెరగలేదు.1998లో 229 ఉంటే ఇప్పుడు 993కు పెరిగాయి. 2020 నాటికి మొత్తం 1500 కావాల్సి ఉంది. ప్రస్తుతం 18-24 సంవత్సరాల మధ్య వయస్సున్న వారిలో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే కాలేజీకి వెళుతున్నారు. దాదాపు కోటి మంది ఏటా డిగ్రీలు పొందుతున్నారు. వారి పరిజ్ఞానం, నైపుణ్యం చాలా తక్కువ స్ధాయిలో ఉంది. ఉపాధి అవసరాలకు తగినట్లుగా లేదు. ఏటా రెండు లక్షల మంది ఎంఫిల్‌ లేదా పిహెచ్‌డిలు పొందుతున్నారు. వారి పరిశోధన, బోధనా స్ధాయిలు ఉండాల్సినంతగా లేవు. విద్య మీద పెట్టుబడిలో ప్రపంచంలో మనది 158, అత్యంత వెనుకబడిన సూడాన్‌ మన కంటే ఒక స్ధానంలో ముందుంది. నమీబియా 159లో ఉంది. అమెరికా 27, చైనా 44వ స్ధానాల్లో ఉన్నాయి.
      ప్రపంచ ఆకలి సూచిక-2019లో 117 దేశాల జాబితాలో మనది 102. పదే పదే చెప్పాలంటే సిగ్గువేస్తోంది. శ్రీలంక 66, నేపాల్‌ 73, బంగ్లా 88, పాకిస్తాన్‌ 94లో ఉంది. మనువాదులు చెప్పే అఖండ భారత్‌లోని ఆఫ్ఘనిస్తాన్‌ 108వ స్ధానంలో ఉంది. ఇదంతా ఎప్పుడు, చైనా కంటే వేగంగా మనం అభివృద్ధి చెందుతున్నాం. త్వరలో దాన్ని అధిగమిస్తున్నామని చెప్పిన తరువాతని గమనించాలి. ఇక అందరికీ ఆరోగ్యం సంగతి చూద్దాం. ఆదాయం తగినంత లేక భరించలేని ఆరోగ్య ఖర్చుతో అప్పుల పాలై ప్రతి ఏటా ఆరు కోట్ల మంది జనం దారిద్య్రం లోకి దిగజారుతున్నారన్న అంచనాలు ఉన్నాయి. లాన్సెట్‌ అధ్యయనం ప్రకారం గోవాలో ప్రతి 614 మందికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి పడక ఉంటే బీహార్‌లో 8,789 మందికి ఒకటి ఉంది. వాటిలో సౌకర్యాలు, ఆధునిక పరికరాల సంగతి సరేసరి. కేంద్ర పెద్దలు చెప్పే ఆయుష్మాన్‌ భారత్‌ స్థితి ఇది. ఇలాంటి అంశాలన్నీ మానవాభివృద్ధి సూచికల్లో ప్రతిబింబిస్తాయి.
మన దేశ జిడిపి పెరుగుతున్నది. కానీ జనం చేతుల్లోకి పోతే మానవాభివృద్ధి మెరుగుపడుతుంది. అదే వేళ్ల మీద లెక్కించదగిన కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమైతే అంకెల్లో గొప్పలు చెప్పుకోవటానికి మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యుఇఎఫ్‌) ప్రపంచ సామాజిక చలనశీలత లేదా పరివర్తనీయత నివేదిక 2020 ఏం చెప్పింది? గణనీయమైన ఆర్థిక పురోగతి సాధించినప్పటికీ భారత్‌లోని సామాజిక ఆర్థిక అసమానత జనంలో గణనీయమైన భాగాన్ని దానికి దూరంగా ఉంచినట్లు పేర్కొన్నది. అల్పాదాయ తరగతి కుటుంబాల్లో జన్మించిన వారు సరాసరి ఆదాయాన్ని పొందేందుకు ఏడు తరాలు పడుతుందని కూడా చెప్పింది. 2013 నాటి వివరాల ప్రకారం తలసరి రోజుకు 32 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తున్న వారు దేశంలో 22 కోట్ల మంది ఉన్నారు. జాతీయ గణాంక సంస్ధ అంచనా ప్రకారం 2019-20లో తలసరి వార్షిక జాతీయ ఆదాయం రూ.1,12,835 ఉంది. పేదలు దీన్ని చేరుకోవాలంటే ఏడు తరాలు పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక చెప్పింది. ప్రపంచ సామాజిక చలనశీలత లేదా పరివర్తనీయత నివేదిక-2020 ప్రకారం 82 దేశాల జాబితాలో మనది 76వ స్ధానం.
      మానవాభివృద్ధికి ఉపాధి, తద్వారా వచ్చే ఆదాయం కూడా ముఖ్య పాత్ర వహిస్తుందన్నది తెలిసిందే. మన దేశంలో జనాభా తప్ప ఉపాధి అవకాశాలు, అవసరాలకు తగినట్లుగా వేతనాలు పెరగటం లేదు. 2005 మార్చి నుంచి 2012 మార్చి నాటికి 459.4 నుంచి 474.2 మిలియన్లకు మొత్తం ఉపాధి పెరిగింది. 2018 నాటికి అది 465.1 మిలియన్లకు తగ్గిపోయింది. ఈ కాలంలో కార్మికశక్తి 470.2 నుంచి 495.1 మిలియన్లకు పెరిగింది. కార్మికశక్తి భాగస్వామ్యం 43 నుంచి 36.9 శాతానికి తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్థిక వ్యవస్ధ దిగజారుడుకు కారణమైందని తెలిసిందే. పురుష వ్యవసాయ కార్మికుల వేతనాలు 2014 డిసెంబరులో 5.13 శాతం పెరిగితే 2016లో 6.77, 2018లో 4.84 శాతం పెరుగుదల రేటు ఉంది. అంటే నిజవేతనాలు గణనీయంగా పడిపోయాయి. నిపుణులైన కార్మికుల వేతనాల పెరుగుదల రేటు ఈ కాలంలో 6.16 నుంచి 4.06 శాతానికి పడిపోయింది. ఇది తలసరి వినియోగం తగ్గటానికి దారి తీసింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు.
      వివిధ అంతర్జాతీయ సూచికలు, పోలికల్లో మన దేశ స్ధానం గౌరవ ప్రదమైనదిగా లేనప్పటికీ మన ప్రధాని, బిజెపి నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టను పెంచామని పదే పదే చెప్పుకుంటున్నారు. మనం సాధించామని చెబుతున్న ప్రచారానికి విశ్వసనీయత చేకూర్చే ఆధారాలు ఎక్కడా కనిపించటం లేదు. అది యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలోనూ, ఆ యాభై ఏళ్లలో చేయలేని దానిని ఐదేళ్లలో చేసి చూపించామని చెప్పుకొనే బిజెపి ఏలుబడిలోనూ కనిపించటం లేదు. అప్పుడూ ఇప్పుడూ అసలు సమస్యల నుంచి జనాన్ని పక్కదారి మళ్లించే నినాదాలు, చర్యలు మాత్రమే కనిపిస్తున్నాయి.
       ఆర్థిక విషయానికి వస్తే కరోనాకు పూర్వం దిగజారిన స్ధితికి అయినా ఎప్పటికి వస్తుందో ఎవరూ చెప్పలేరు. వివిధ అంతర్జాతీయ సంస్ధలు రూపొందించిన సూచికల్లో మన స్ధానం ఎలా ఉందో చూద్దాం. ఏడాది కాలంలో కనీసం 15 అంశాల్లో దిగజారిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కెనడా లోని ఫ్రాసర్‌ సంస్ధ రూపొందించే ఆర్థిక స్వేచ్ఛ సూచికలో మన దేశం 2019 సూచికలో 79వ స్ధానంలో ఉంటే 2020లో 105కు పడిపోయింది. ప్రజాస్వామ్య సూచికలో 2018తో పోల్చితే పది స్ధానాలు దిగజారి 2019లో 51వ స్ధానంలో ఉంది. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన 2014లో 27వ స్ధానంలో ఉండేది. పత్రికా స్వేచ్ఛలో 142, మహిళలకు భద్రతలో 133, ప్రపంచ సంతోష సూచికలో 133 నుంచి 140కి దిగజారింది. శాంతి సూచికలో ఐదు స్ధానాలు దిగజారి 163 దేశాలలో 141కి, ప్రపంచ పోటీతత్వ సూచికలో పది స్ధానాలు దిగజారి 68కి, స్త్రీ పురుష నమానత్వ సూచికలో 112కు దిగజారింది. పాస్‌పోర్టు సూచికలో 199 దేశాలలో మనది 84వ స్ధానం. ఇలా అనేక సూచికలు దిగజారటం నరేంద్రమోడీ పాలనలో కనిపిస్తోంది. వాటి కొనసాగింపే మానవాభివృద్ధి సూచిక పతనం !

ఎం. కోటేశ్వరరావు

మోడీ పాలనలో ప్రపంచ సూచికలన్నింటా పతనమే !