Feb 01,2021 13:47

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం తర్వాత మొండి బాకీలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు రూ.20,000 కోట్ల మూలధనం అందించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. బ్యాంక్‌ల నిరర్ధక ఆస్తులను అధిగమించడానికి అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎఆర్‌సి)-అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఎఎంసి మెకానిజం) తరహా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నామన్నారు. మంత్రి బ్యాడ్‌ బ్యాంక్‌ అని ప్రత్యేకంగా ఉచ్చరించనప్పటీకి ఆ తరహా సంస్థను ఏర్పాటు చేస్తామని దీంతో స్పష్టమవుతోంది. దీని ఏర్పాటు ద్వారా మొండి బాకీలను బ్యాడ్‌ బ్యాంక్‌కు అప్పగించడం ద్వారా బ్యాంక్‌లు త్వరితగతిన తమ రుణ ఖాతాలను త్వరితగతిన క్లీన్‌ చేసుకోవడానికి వీలుంటుందని ప్రభుత్వ ఉద్దేశ్యం. బ్యాడ్‌ బ్యాంక్‌ తరహా సంస్థ ఏర్పాటుకు ఎంత మొత్తం మూలధనం అందించనున్నారో వెల్లడించలేదు. ఆర్‌బిఐ ఫైనాన్సీయల్‌ స్టెబిలిటీ రిపోర్ట్‌ ప్రకారం 2021 సెప్టెంబర్‌ నాటికి బ్యాంక్‌ల స్థూల నిరర్థక ఆస్తులు 13.5 శాతానికి చేరొచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరం బ్యాంక్‌లకు ఎలాంటి మూలధనం కూడా అందించలేదు. మరోవైపు రెండు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటు వర్గాలకు విక్రయించనున్నట్లు మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టం చేసింది.