గువహటి : వచ్చే నెలలో జరిగే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి విడుదల చేసిన అభ్యర్థుల జాబితా పట్ల పార్టీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఆదివారం ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌బీరేన్ సింగ్ దిష్టిబమ్మలను బిజెపి మద్దతుదారులు దహనం చేశారు. ఫ్లకార్డులను చేతబూని ఆందోళనలు చేపట్టారు. అధిష్టానం, రాష్ట్ర నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాల ధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఇంఫాల్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ అభ్యర్థుల జాబితా పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు పార్టీని వీడినట్లు సమాచారం. కాంగ్రెస్ నుండి ఫిరాయించిన వారికి టికెట్లు ఇస్తూ.. తమకు ప్రాధాన్యత ఇవ్వని వారే ఆందోళనలకు దిగారని తెలుస్తోంది. మణిపూర్‌లోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తోంది. దీనికి సంబంధించిన జాబితాను తాజాగా విడుదల చేసింది. కాగా, కాంగ్రెస్ నుండి ఇటీవల బిజెపిలోకి చేరిన 10 మంది నేతలకు టికెట్లు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ .. సాంప్రదాయంగా వస్తున్న హీన్‌గాంగ్ నుండే పోటీకి దిగుతున్నారు. మరో కీలక మంత్రి బిశ్వజిత్ సింగ్ తోంజు స్థానం నుండి పోటీ చేస్తున్నారు. మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు.. సోమాతై సైజా.. ఉఖ్రుల్ నుండి బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రి నమ్మకస్తులుగా భావించే వారికి టిక్కెట్లు దక్కినట్లు తెలుస్తోంది. 2017 ఎన్నికల్లో 21 సీట్లను గెలుపొందిన బిజెపి.. చిన్న పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.










