May 10,2023 16:46
  • వైవియు సిడిసి డీన్ డాక్టర్. సుబ్బరాయుడు.

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : విద్యార్థి దశలోనే నైపుణ్యాలు నెరవేర్చుకోవడం వల్ల ఉత్తమమైన ఉద్యోగ అవకాశాలను పొందచ్చని వైవియు సిడిసి డీన్ డాక్టర్ సుబ్బరాయుడు అన్నారు. బుధవారం పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ముత్యాల పెంచలయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చున్నారు. అనంతరం ప్రాంగణ ఎంపికలను ముఖ్యఅతిథిగా విచ్చేసిన వైవియు సిడిసి డీన్ సుబ్బరాయుడు ప్రారంభించారు. ఈ ప్రాంగణం ఎంపికల్లో 19 ప్రముఖ సంస్థలు ఎంపికలు నిర్వహించాయి. సుమారు 712 మంది విద్యార్థులు ప్రాంగణ ఎంపికలకు హాజరు కాగా వారిలో 309 మంది విద్యార్థులు ఉద్యోగాలను పొందినట్లు  మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ జిల్లా ప్లేస్మెంట్ ఆఫీసర్ పి వెంకట ప్రసాద్ వెల్లడించారు. వీరిలో 209 మంది సాయి డిగ్రీ కళాశాల  విద్యార్థులు ఉన్నట్లు ప్రిన్సిపల్ పెంచలయ్య తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పి శ్రీనివాసులు, చెంగల్ రాజు, ఎస్ ఎన్ శ్రీనివాసులు, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ అడపాల శివకుమార్ అధ్యాపకులు పాల్గొన్నారు.