Dec 17,2020 06:41

కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించింది. ధాన్యం మొత్తం సేకరిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, జాయింట్‌ కలెక్టర్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ధాన్యం మాత్రం కొనడంలేదు. కొనకుండా ఆలస్యం చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కొన్నా అరకొరగానే కొంటున్నది. మొక్కజొన్న పరిస్థితీ అదే. రేపు మోడీ వ్యవసాయ చట్టాలు అమలు లోకి వస్తే వ్యాపారులు రైతును బతకనిస్తారా?

ప్రకటనలే తప్ప ధాన్యం కొనరా?
ధాన్యం తయారై పది రోజులవుతున్నది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేల ప్రకటనలు చేస్తున్నారు. పేపర్లలో ఫోటోలు దిగుతున్నారు. టి.వి లలో మాట్లాడుతున్నారు? 15వ తేదీ వరకు రైతు నుండి ప్రభుత్వం ఒక్క ధాన్యపు గింజ కొనలేదు. గోనె సంచి ఇవ్వడం లేదు. ప్రభుత్వం వాలకం చూసి ధాన్యం కొనదేమోనని అనుమానంతో రైతులు బస్తాకు రూ. 300 తక్కువకు దళారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. పైగా గత సంవత్సరం ఇచ్చిన ధాన్యానికి ఇప్పటికీ డబ్బు రాని రైతులను చూసి మరీ భయపడిపోతున్నారు. మొక్కజొన్న కూడా ప్రభుత్వం సక్రమంగా సేకరించలేదు. అందులో కూడా రైతులు క్వింటాల్‌కు రూ. 500 నష్టపోయారు.

ప్రభుత్వం, మిల్లర్ల ఉమ్మడి కుట్ర
ప్రకటించిన విధంగా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వెనుక మిల్లర్లతో ప్రభుత్వ అధికార్ల కుమ్మక్కు ఉంది. అందుకు మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడి ఉంది. మేం కొనుగోలు కేంద్రాలపై ప్రకటనలు ఇస్తుంటాం. మీరు మాత్రం ప్రారంభించ వద్దని మంత్రాంగం చేస్తున్నారు. విసిగిపోయిన, నమ్మకం పోయిన రైతులు తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకుంటారు. 'రైతును మోసం చేస్తేనే లాభం. ఎందుకు కొనలేదంటే మిల్లర్లు 'బి.జి' (బ్యాంక్‌ గ్యారంటీ)లు తీయలేదని మిల్లర్లపై నేరం నెట్టేద్దాం'. ఇదీ మిల్లర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తెర వెనుక ఆడుతున్న నాటకం.

ప్రభుత్వ సేకరణను నిర్వీర్యం చేసే కుట్రలు
పై కారణాల వలన రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి కావాల్సింది అదే. బయట ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని రైతుపైనే నెపం మోపి కొనుగోలు నుండి తప్పుకోవచ్చు. కొంత ఆలస్యమైనా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రైతు ధాన్యం కొనిపించాలి. లేకుంటే ఇపుడు నష్టమే కాదు రేపు మోడీతో కలిసి శాశ్వతంగా ప్రభుత్వ కొనుగోళ్లు నుండి పప్పుకుంటారు. మోడీ చేసిన చట్టం ప్రకారం ప్రభుత్వం మార్కెట్‌ నుండి తప్పుకొని ప్రైవేట్‌కు అప్పచెప్పడమే కదా! దానికి జగన్‌, చంద్రబాబు ఇద్దరూ జై కొట్టి ఓటు వేసి పార్లమెంటులో గెలిపించారు. ఆలస్యం చేసి, రకరకాలుగా విసిగించి ప్రభుత్వ సేకరణను నిర్వీర్యం చేసే ప్రభుత్వ కుట్రలో రైతులు పడవద్దని విజ్ఞప్తి. ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడి చివరి గింజ కొనేంత వరకు పోరాడాలి.

నేరం ప్రభుత్వానిది-నష్టం రైతుకా?
మన వాతావరణంలో కాస్త దిగుబడి వచ్చే 1001 రకం వద్దని.. పభుత్వం 1121 వెరైటీని రైతుకు అంటకట్టింది. ఇది ఏమాత్రం ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేదు. ఏమాత్రం తడి తగిలినా మొలక వచ్చేస్తున్నది. మంచుకు కూడా మొలక వచ్చేస్తున్నది. ఈ ఏడాది అకాల వర్షాల వలన ఎక్కువ ధాన్యానికి మొలక వచ్చింది. మొలక వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన విత్తనం గనుక మొలక వచ్చిన ధాన్యం కూడా ప్రభుత్వమే సేకరించాలి.
 

రైతు పంటంతా కొనాలి.. కౌలు రైతు పంటా కొనాలి
రెవెన్యూ అధికారులు రైతు భూమి మొత్తం వారి పేరున రికార్డు చేయలేదు. అతి తక్కువ భూమి మాత్రమే నమోదు చేశారు. వెబ్‌ ల్యాండ్‌ పేరుతో రైతు పండించిన మొత్తం పంట ప్రభుత్వం కొనడం లేదు. కౌలు రైతులు సాగు చేసిన భూమి వారి పేరున రికార్డు చేయడం లేదు. అందువలన కౌలు రైతు నుండి ప్రభుత్వం పంట సేకరణే చేయలేదు. ఈ కారణాల వలన ప్రభుత్వం కొనడం లేదు గనుక రైతు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. రైతు భూమంతా అతని పేరున నమోదయ్యేంత వరకు, కౌలు రైతుకు అతను సాగు చేసిన భూమికి కౌలు హక్కు వచ్చేంత వరకు ప్రతి గింజను ప్రభుత్వం కొని తీరాలి. ఈ వాస్తవం గమనించి రైతుకు సహకరించాల్సిన ప్రభుత్వం ధాన్యం కొనకుండా రైతును వేధించడం అన్యాయం. రైతును వ్యాపారులకు బలి చేయడం మరీ దారుణం. నేరం ప్రభుత్వానిది. నష్టం రైతులకా?
 

పోరాడి మద్దతు ధర సాధించాలి
ధాన్యం రవాణా చార్జీలు ప్రభుత్వం ఇవ్వదట. ఆ నష్టమూ రైతులదే. మిల్లర్లకూ బియ్యం దిగుబడి తగ్గిందని గోల చేస్తున్నారు. కనుక బస్తాకు ఐదారు కేజీలు అదనంగా ఇవ్వాలని రైతులను అడుగుతున్నారు. ఇదెక్కడి న్యాయం? మిల్లర్ల నష్టానికి రైతు కారణం కాదు కదా? ప్రభుత్వంపై ఒత్తిడి చేసి తమ సమస్య పరిష్కరించుకోవాలి. దిగుబడిలో నష్టపోయిన రైతు కనీస మద్దతు ధరను సాధించుకోవాలి. అందుకు పోరాటమే మార్గం. కనీస మద్దతు ధర మీద బస్తాకు రూ.700 బోనస్‌ ఇచ్చి ధాన్యం కొనడానికి...కేరళ ప్రభుత్వం లాగా ఇది రైతుల పక్షాన నిలిచే సిపిఎం ప్రభుత్వం కాదు కదా!
 

పోరాడుతున్న రైతులకు మద్దతునిద్దాం
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులలో ఎక్కువ మంది మిల్లర్లే అనే వాస్తవాన్ని గుర్తించాలి. మోడీతో కలిసి వ్యాపారులకు రైతును బలి చేసే వ్యవసాయ చట్టాలను బలపర్చిన పార్టీలు ఇవి. అందువలన రైతుకు నష్టం, మిల్లర్లకు మేలు చేసే పనులే చేస్తారు. కనుక రైతులంతా ఐక్యంగా పోరాడి ప్రభుత్వంతో ధాన్యం కొనిపించి కనీస మద్దతు ధర సాధించుకోవాలి. అందుకు రైతులంతా కదిలి అధికార్లపై ఒత్తిడి చేసి ధాన్యం కొనిపించాలి. రైతుకు శఠగోపం పెట్టే మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని గజగజ వణికించే చలిలో పోరాడుతున్న రైతు సోదరులకు మద్దతుగా నిలవాలి. ఇప్పటికే 22 మంది రైతులు ఈ పోరాటంలో అమరులయ్యారు. రైతు నుండి కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పజెప్పే చట్టాల రద్దుకై ఢిల్లీలో జరిగే పోరాటంలో రైతులు భాగస్వాములు కావాలి.
                                        * ఎం. కృష్ణమూర్తి (సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)