జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్‌రెడ్డి
ప్రజాశక్తి - రాయచోటి : జిల్లాలో మాండూస్ తుపాను ప్రభావానికి గురైన రైతులందరికీ నష్టపరిహారం అందజేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్‌రెడ్డి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావం వల్ల జిల్లాలో పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం అందించాలని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులకు సూచించారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు సాగు చేసుకోవడం జరిగిందని పంట నష్టాన్ని మానవతా ద క్పథంతో ఆలోచించి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆయన సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టం జరిగిన ప్రతి రైతు పొలం దగ్గరికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు వెళ్లి పక్కాగా, పగడ్బందీగా పంట నష్టపరిహారం వివరాలు సేకరించాలన్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టపరిహారం సేకరణ వివరాలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ నెల 24వ తేదీ లోపల ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతు వివరాలు పంట నష్టపరిహారం నివేదికలో పొందుపరచాలన్నారు. రైతుల నుంచి సేకరించిన నష్టపరిహారం వివరాలను ఈ నెల 25వ తేదీ నుంచి 29 వరకు సామాజిక తనిఖీ కొరకు రైతు భరోసా కేంద్రాలలో జాబితా ప్రదర్శించాలన్నారు. ఈ నెల 30వ తేదీ పంటనష్ట పరిహారం జాబితా ప్రభుత్వానికి సర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండల సభ్యులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










