దేశ స్వాతంత్ర్యాన్ని, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రక్షించుకుందాం : సిఐటియు నేత డివి కృష్ణ
ప్రజాశక్తి-నందిగామ : భిన్నత్వంలో ఏకత్వం భావనకు ప్రతీక భారతదేశమని, వేలాది కులాలు, వివిధ మతాలు, వందలాది భాషలు కలయిక భారత రాజ్యాంగం అని ఎన్టీఆర్ జిల్లా సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షుడు డి.వి కృష్ణ అన్నారు. శుక్రవారం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశ స్వాతంత్రాన్ని ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అని కోరుతూ ఆగష్టు 1నుండి 15వరకు ప్రచార క్యాంపెయిన్ లో భాగంగా శుక్రవారం నందిగామ పట్టణంలో జాతీయ జెండా భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డివి కృష్ణ మాట్లాడుతూ లక్షలాదిమంది ప్రజలు ఉద్యమ పోరాటం వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని, స్వాతంత్ర పోరాటంలో కనీస పాత్ర లేకపోగా బ్రిటిష్ వారి అడుగులకు మడుగులు ఒత్తిన సంస్థ ఆర్.ఎస్.ఎస్ సంస్థని, ఆ సంస్థ ఈనాడు అధికారంలో ఉన్న బిజెపి పార్టీ అని అన్నారు. ప్రధాని మోడీ నోట్ల రద్దు, సంపన్నులకు రాయితీలతో మోడీ సర్కార్ కుబేరులకు కొట్లాది రూపాయలు కట్టబెడుతున్నదని, అదే సందర్భంలో ప్రజలపై అనేక విధాలుగా భారాలు మోపుతున్నదని, ఇటువంటి భారాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా పోరాటం చేయాలని, భారత దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని అన్నారు.
ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికీ స్వాతంత్ర్య ఫలాలు అందని వారు ఎంతో మంది ఉన్నారని,ఎటువంటి బేధభావాలు లేకుండా స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా మంది ఁపాణాలు అర్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు, సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కే. గోపాల్ , ఖాసిం,వి. రవి శేఖర్, కరి వెంకటేశ్వరరావు ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపీనాయక్ అధ్యక్షులు పాటి.రవి,డివైఎఫ్ఐ నాయకులు జక్కులూరి రవి, హసేన్, దామోదర్ పుల్లయ్య, ఉప్పుతోళ్ళ కుమారి , స్వామి, ఉప్పు శ్రీను, తదితరులు ఉన్నారు. చైతన్య కాలేజీ నారాయణ, ఇ టెక్నో స్కూల్, అక్షర కాలేజీ, కాకతీయ స్కూల్, నారాయణ ఆంగ్లో వేదిక్ స్కూల్, ఏ.వి.ఆర్ రామకృష్ణ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.










