’చట్టానికి కళ్లు లేవు. న్యాయానికి ఇల్లు లేదు' అన్న నానుడి మరోసారి రుజువైంది. 28 సంవత్సరాలు, అత్యున్నత పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో 600 పైగా సాక్ష్యాధారాలు, 351 మంది సాక్షులు, 500 పేజీల లిఖిత వాదనలు, 2300 పేజీల తీర్పు, ఏడాది కిందటే రిటైర్ కావలసిన న్యాయమూర్తికి పొడిగింపు, అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు, జోక్యాలు, ఉన్నత న్యాయస్థానం, ఒకటికి రెండు కోర్టుల విచారణ, మధ్యలో ఒక కమిషన్, దేశమంతా చూసిన దృశ్యాలు, వందల వేల మీడియా నివేదికలు ఎన్ని వుంటేనేం? లక్నోలో విచారణ ముగించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ సురేంద్ర కుమార్ యాదవ్‌కు ఈ సాక్ష్యాలేవీ సంతృప్తి కలిగించలేకపోయాయి. 1992 డిసెంబరు ఆరవ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసం వెనక కుట్ర కోణం వుందనడానికి సరైన సాక్ష్యాలు లేవంటూ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్‌లతో సహా 32 మందిని గుండు గుత్తగా వదిలిపెట్టేశారు. ఆ మూడు గుమ్మటాల కింద రామ్‌లల్లా విగ్రహాలు వున్నాయి గనక భక్తులైన వారెలా కూల్చివేస్తారని ఆయన ఆధ్యాత్మిక సందేహాలు తీసుకొచ్చారు. ఈ కారణంగానే విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడైన అశోక్ సింఘాల్ కట్టడాన్ని కాపాడేందుకు ప్రయత్నించారని కూడా కితాబునిచ్చారు. తన దగ్గర ప్రత్యేకాధారాలు లేకున్నా ఇందులో పాకిస్తాన్ ఐఎస్‌ఐ హస్తం వున్నా సిబిఐ కనిపెట్టలేకపోయిందని తప్పు పట్టారు. దేశ చరిత్రలో ఎరుగని మతతత్వ రాజకీయాల వ్యాప్తికి, ఘర్షణలకు, వందలాది మంది మరణించడానికి పేలుళ్లకూ కారణమై దశాబ్దాల పాటు కొనసాగిన ఈ విధ్వంసకాండపై న్యాయమూర్తి అయిదు నిముషాల్లో కీలక భాగాలు చదివేశారు. ఆయన తీర్పు చదువుతుండగానే అక్కడ 'జై శ్రీరాం' నినాదాలు మార్మోగిపోయాయట. గత నవంబరులో సుప్రీంకోర్టు అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన ఏడాది లోపే నాటి విధ్వంసం కేసు కూడా కొట్టివేయబడింది. అదే తీర్పులో సుప్రీంకోర్టు రామమందిర నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయాలని చెప్పడం ఆ ట్రస్టు ఆధ్వర్యంలో మందిర నిర్మాణం భూమి పూజలో ప్రధాని మోడీ పాల్గొనడం కూడా జరిగిపోయాయి. అయితే అదే తీర్పులో సుప్రీం కోర్టు బాబ్రీ విధ్వంసం అత్యంత దుర్మార్గమైన చట్ట ఉల్లంఘన చర్య అని విమర్శించింది. కాని ఇప్పుడు ఆ చట్ట ఉల్లంఘనకు బాధ్యత ఎవరిదీ కాకుండా పోయింది. లిబర్‌హన్ కమిషన్ సవివరంగా నిరూపించిన కుట్ర నిజం కాదని ప్రకటించబడింది.
విహెచ్‌పి ని ముందుంచి సాధుసంతుల పిలుపుపై 'కరసేవ' అంటూ బిజెపి అగ్రనేతలు అక్కడకు తరలిపోవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని దేశమంతా భావించింది. అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు ఏ చర్యయినా తీసుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్‌ఐసి సమావేశంలో అధికారమిచ్చాయి. సిపిఎం అప్పటి ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ వాటన్నిటి తరపున ఆ మేరకు ఒక తీర్మానం ప్రతిపాదించారు. అయోధ్య ఫైజాబాద్‌కు ప్రత్యేక దళాలు పెద్ద ఎత్తున తరలించబడ్డాయి. అయినా సరే జరగాల్సింది జరిగిపోయింది. దేశం అట్టుడికి పోవడమే గాక అంతర్జాతీయంగానూ విమర్శలు వచ్చాయి. అద్వానీ వంచించారని పి.వి అన్నారు. తనను సమర్థించుకుంటూ ఒక పుస్తకమే రాసుకున్నారు. ఆయన కావాలనే ఉపేక్షించారని అప్పటి హోం మంత్రి ఎస్.బి. చవాన్ తమ జ్ఞాపకాలలో రాశారు. కూల్చివేత తర్వాత కళ్యాణ్ సింగ్‌ను ఇతర బిజెపి ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి ఎన్నికలకు వెళితే ప్రజలు ఓడించారు. ఈ విధ్వంసానికి సంబంధించి గుర్తు తెలియని లక్షలాది కరసేవకులపై ఒక కేసు, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి హేమాహేమీలపై మరో కేసు సిబిఐ నమోదు చేసింది. తర్వాత వాటిని ఒకటిగా కలిపేశారు. మొత్తం 48 మందిపై అభియోగాలు చేయగా 16 మంది ఈ కాలంలో మరణించారు. ఇచ్చిన మాట తప్పి కరసేవ శాంతియుతంగా జరుగుతుందని చేసిన వాగ్దానం భంగపర్చిన యు.పి మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌కు కోర్టు హాలు లోనే అంతకు ముందే ఒకరోజు శిక్ష విధించింది. కాని ఈ పరిణామక్రమం బిజెపి పెరుగుదలకు కారణమై వాజ్‌పేయి ప్రభుత్వం పాలన కొనసాగించింది. అందులో అద్వానీ హోం మంత్రిగా అదే సిబిఐ కి మార్గదర్శి అవడం ఒక చారిత్రిక విచిత్రం, ఒక సిబిఐ దశలో ఆయనను మినహాయిస్తే మరో మంత్రి మురళీ మనోహర్ జోషి రాజీనామా చేస్తానంటూ కలకలం రేపారు. మరో దశలో కూల్చివేసిన కరసేవకులను ఏమీ చేయలేనప్పుడు ఈ ప్రముఖులకే శిక్ష వేయడం సరికాదని కోర్టు కొట్టివేస్తే హైకోర్టు కూడా దాన్ని బలపరిస్తే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని 2017లో వాటిని మళ్లీ పునరుద్ధరించేలా చేసింది. అయోధ్య తీర్పులో కూడా కూల్చివేతను తీవ్ర పరిభాషలో ఖండించింది. అయితే ఈ తీర్పుతో అదంతా అపహాస్యం పాలైంది. కుట్ర జరిగిందనడానికి సిబిఐ బలమైన ఆధారాలు సమర్పించలేకపోయిందని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి దాఖలు చేసిన వీడియోలు స్పష్టంగా లేవని కొట్టిపారేశారు. మీడియా కథనాలపై ఆధారపడలేమన్నారు. కూల్చివేతకు గర్వపడుతున్నామని ఈ నాయకులంతా ప్రకటించిన వాస్తవం పట్టించుకోలేదు. రాముడి కోసం ఎంత శిక్షయినా భరిస్తామని బీరాలు పలికిన ఆ నేతలు కూడా ఇప్పుడు మాట్లాడలేదు. దీనిపై తదుపరి అప్పీలుకు వెళ్లే విషయం చెప్పలేనని సిబిఐ న్యాయవాది లలిత్ కుమార్ చెప్పడం యాదృచ్ఛికం కాదు.
రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా రథయాత్రలు, కరసేవలు నడిపించిన అద్వానీ 'జై శ్రీరాం' అంటూ తీర్పు తన విశ్వాసాన్ని బలోపేతం చేసిందన్నారు. మోడీ హయాంలో గ్రహణం పట్టిన అద్వానీని తీర్పు రాగానే న్యాయ శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ నివాసానికి వెళ్లి అభినందించి వచ్చారు. సాధ్వి రితంభర, సాక్షి మహరాజ్, వినరు కతియార్ వంటివారు దుందుడుకు వ్యాఖ్యలే చేశారు. అయితే ఈ తీర్పుపై ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు పెద్దగా స్పందించవద్దని వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నాయి. జరగాల్సిందే జరిగిందన్నట్టు తమ పంతం నెగ్గిందన్నట్టు వారి కదలికలు వున్నాయి. మనం కోరుకున్నది జరిగి, మన వారందరూ నిర్దోషులుగా బయిటకు వచ్చాక మాట్లాడటమెందుకనే వైఖరి తీసుకున్నందునే బిజెపి తరపున ప్రకటన వెలువడలేదు. రాజ్‌నాథ్ సింగ్ వంటి కీలక నాయకులు 'మా వాదన, విశ్వాసం నిజమైనాయ'ని ముక్తసరిగా సమర్థించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అందరికన్నా క్లుప్తంగా వ్యాఖ్యానించింది. సంఫ్‌ు ఉప అధినేత సురేష్ భయ్యాజీ జోషి తన ప్రకటనలో 'వివాదాస్పద కట్టడం విధ్వంసానికి సంబంధించిన కేసులో నిందితులందరినీ సిబిఐ కోర్టు గౌరవప్రదంగా విడుదల చేయడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ స్వాగతిస్తుంది' అని పేర్కొన్నారు. ఇక దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు సమాజం లోని భిన్న తరగతులు ఒక తాటి మీదకు వస్తారని ఆశిస్తున్నామన్నారు. అంటే ఇప్పటికీ అది వివాదాస్పద కట్టడంగా తప్ప మసీదుగా గుర్తించకపోవడం, ఇంత జరిగాక ఎలాగో విడుదలైతే గౌరవప్రద ప్రక్రియగా అభివర్ణించడం, అందరూ తమ నాయకత్వం లోకి రావాలని పిలుపునివ్వడం ఇందులో సారాంశం.
మరోవైపున ఈ తీర్పు సుప్రీం కోర్టు వైఖరికి భిన్నంగా వుంది గనక సిబిఐ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్ వేయాలని కాంగ్రెస్ చాలా మంద్ర స్వరంతో కోరింది. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే గాక భారత దేశ లౌకిక ప్రతిష్టకు భంగకరంగా వుందని సిపిఎం, వామపక్షాలు విమర్శించాయి. చాలా ప్రాంతీయ పార్టీలు మాట్లాడలేదు. ముస్లిం సంస్థల నాయకులలో ఒకరిద్దరు హర్షం వెలిబుచ్చినా పైకోర్టులో అప్పీలు చేస్తామని ఎక్కువ మంది ప్రకటించారు. 'ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ టెలిగ్రాఫ్, హిందూస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా' తదితర పత్రికలు నిందితులందరినీ వదలివేయడం పట్ల అసమ్మతి వెలిబుచ్చుతూ సంపాదకీయాలు రాశాయి. ఉద్దేశపూర్వకమైన ఉపేక్షతో కేసు ఓడిపోయిన సిబిఐ ఇప్పటికైనా కళ్లు తెరిచి బలమైన వాదనలతో ఉన్నత న్యాయస్థానాలలో పోరాటం కొనసాగించాలి. అత్యున్నత న్యాయం వ్యవస్థ మేధావి వర్గం ఈ పరిణామాలపై దృష్టి సారించాలి. ప్రియతమ భారతాన్ని కాపాడుకోవాలంటే లౌకిక వాదులంతా చేతులు కలపాలి. లేదంటే యు.పి, బీహార్ ఎన్నికల లోనూ ఇతరత్రా కూడా మతోన్మాద శక్తులు మరింత పేట్రేగిపోయే ప్రమాదం వుంది. ఈ తీర్పు రాకముందే మధురలో కృష్ణ జన్మ స్థానంలో మసీదును తొలగించాలంటూ కొత్త కేసు ప్రారంభించడం అలాంటి సూచిక. ప్రస్తుతానికి దాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చినప్పటికీ పరివార్ సంస్థలు కొన్ని మళ్లీ ఆ కాశీ, మధుర వివాదాలను తిరగదోడటానికి సిద్ధమవుతున్న కథనాలు వినిపిస్తున్నాయి.- తెలకపల్లి రవి










