Oct 31,2023 00:28

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు! నిండు గర్భిణి దారుణ హత్య

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు!
నిండు గర్భిణి దారుణ హత్య
ప్రజాశక్తి- వరదయ్యపాలెం: కట్టుకున్న వాడే కాలయముడై నిండు గర్భిణిని హత్య చేసిన సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం హరిజన వాడకు చెందిన కాటయ్య ఎనిమిది సంవత్సరాల క్రితం ఇరకం పావని(26)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని ఇటీవల కాలంలో పావని పై అనుమానం పెంచుకున్న భర్త చీటికిమాటికి భార్యపై గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో హత్య చేసి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ శివకుమార్‌ రెడ్డి, ఎస్‌ఐ నాగార్జున్‌ రెడ్డి హత్య తీరును, ఇంటి పరిసరాలను పరిశీలించారు. వివాహిత మతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం సత్యవేడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సిఐ మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. భార్య భర్తల మధ్య సరైన సత్సంబంధాలు లేవని గ్రామస్తలు తెలిపిన నేపథ్యంలో హత్యకు గల కారణాలు, కారకులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు కాటయ్యను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిండు గర్భిణీని కనికరం లేకుండా హత్య చేసిన కాటయ్యను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరారు.