కరోనా నేపథ్యంలో మార్చి 24న లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత మూతబడిన పాఠశాలలు, కళాశాలలు 7 నెలల తరువాత కూడా తెరుచుకునే పరిస్థితి కనిపించటం లేదు. నవంబర్ 2 నుండి 9,10 తరగతులు, కళాశాలలు ప్రారంభించాలని, నవంబర్ 23 నుండి 6,7,8 తరగతులు, డిసెంబర్ 14 నుండి 1-5 తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికి పిల్లలను పాఠశాలలకు పంపించటానికి తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి కనపడుతున్నది. ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు ఈ కరోనా కాలంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని కుటుంబాలు గడవని పరిస్థితి ఏర్పడింది. వందల మంది ఉపాధి కూలీలుగాను, కూరగాయలు, పండ్లు అమ్మే వెండర్లుగాను మారారు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా మీడియాలో వచ్చాయి. వీరిని ఆదుకోవలసిన ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 38 లక్షల మంది పిల్లలు చదువుతుండగా, 1,80,000 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 32 లక్షల మంది పిల్లలు చదువుతుండగా 1,16,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మొత్తం 70 లక్షల మంది పిల్లలలో 54 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో...44 శాతం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో...2 శాతం పైగా పిల్లలు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరుగాక 1,20,000 మంది అధ్యాపకులు ప్రైవేటు జూనియర్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు యాజమాన్యాలు మార్చి నెల జీతం ఏప్రియల్ నెలలో చెల్లించాయి. మే నెల నుండి అక్టోబర్ వరకు 90 శాతం యాజమాన్యాలు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు కనీసం సగం జీతాలు కూడా ఇవ్వలేదు. విద్యార్థుల నుండి ఫీజులు వసూలు కాలేదనే కారణాన్ని చెబుతున్నాయి. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఆగస్ట్ నుండి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించినప్పటికి, పాఠశాల లోని కొద్దిమంది ఉపాధ్యాయుల సేవలు మాత్రమే వినియోగించుకుంటూ, వారికి మాత్రమే సగం జీతం చెల్లిస్తున్నాయి. రాష్ట్రంలో గల 15,290 ప్రైవేట్ స్కూళ్లలో 80 శాతం ''బడ్జెట్ స్కూళ్ల''ని, వీటిని నడపలేక ఇబ్బంది పడుతున్నామని యాజమాన్యాలు వాపోతున్నాయి. కాని పాఠశాలల నిర్వహణ ఉపాధ్యాయులు అనే ''మానవ వనరుల''పై ఆధారపడి ఉన్నది కనుక, ఉపాధ్యాయుల శ్రేయస్సును, సంక్షేమాన్ని కాపాడుకోవలసిన బాధ్యత యాజమాన్యాలపై ఉన్నది.
గత మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల సంఖ్య విపరీతంగా పెరిగింది. భారతదేశం లోని 28 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే 40 శాతం పైగా పిల్లలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉన్నారు. 1994లో జారీ చేసిన జీవో నెం 1 ప్రకారం విద్యార్థుల నుండి వసూలు చేసే ఫీజులో 50 శాతం ఉపాధ్యాయుల జీతాలకు, 15 శాతం పాఠశాల నిర్వహణకు, 15 శాతం పాఠశాల అభివృద్ధికి, 15 శాతం ఉపాధ్యాయుల రిటైర్‌మెంట్ బెనిఫిట్లకు, 5 శాతం యాజమాన్య లాభంగా వినియోగించాలి. కాని రాష్ట్రంలో ఈ జీవో ఏ పాఠశాల లోనూ అమలు జరగటం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఎటువంటి యంత్రాంగం లేదు. తల్లిదండ్రుల కమిటీలు (పేరెంట్స్ కమిటీలు) పని చేయటం లేదు. పాఠశాలల్లో మౌలిక వసతులైన ఆటస్థలం, గ్రంథాలయం, ల్యాబ్ ఉన్న ప్రైవేటు పాఠశాలలు 10 శాతం కూడా ఉండవు. అనేక కార్పొరేట్ పాఠశాలలు అపార్ట్‌మెంట్లలో నడుపుతుంటే వాటికి ఏ విధంగా అనుమతి ఇచ్చారో విద్యాశాఖ అధికారులకే తెలియాలి. కార్పొరేట్ యజమానులు మంత్రులు, ప్రజాప్రతినిధులు అయ్యే స్థాయికి చేరుకున్నారు. కానీ వారెవరూ కరోనా సమయంలో కష్టాలు పడుతున్న ఉపాధ్యాయుల గురించి ఆలోచించలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ''నవరత్నాలు'' పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కాంతారావుకి అనేక ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘాలు, ఎమ్మెల్సీలు వినతి పత్రాలు అందించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర విద్యామంత్రికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులకు ఇంతవరకు ఎటువంటి సహాయం అందలేదు. 'నవరత్నాల'లో భాగంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులందరూ కోరుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రైవేటు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించేలా డిఇఓ లు, ఎంఇఓ లు చూడాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఇటీవల జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. కాని రాష్ట్రంలో ఏ మండలం లోను, ఏ జిల్లా లోను ఈ ఉత్తర్వులు అమలు జరగలేదు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు వేలాది మంది అధ్యాపకులను ఉద్యోగాల నుండి తొలగించి, కరోనా తగ్గిన తరువాత విద్యార్థులు చేరితే, అప్పుడు మళ్లీ చేరు2్చకుంటామని చెబుతున్నాయి. మొత్తం ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు రక్షణ లేకుండా పోయింది.
ఏ తరహా విద్యా వ్యవస్థలోనైనా ఉపాధ్యాయులే ప్రముఖ పాత్ర వహిస్తారు. విద్యా రంగంలో పెరిగిన టెక్నాలజీ వినియోగం కూడా ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదని అనేక పరిశోధనలు, పరిశీలనలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్ బోధన కూడా విద్యార్థులను విశేషంగా ఆకర్షించడం లేదని అనేక మంది విద్యావేత్తలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులను జాతి సంపదగాను గుర్తించవలసిన అవసరం వున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో, టాలెంట్ పరీక్షలలో అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రైవేటు రంగంలో అతి తక్కువ జీతాలు పొందుతూ కూడా అద్భుతమైన కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో 'నాసా' వంటి పోటీలలో కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పాల్గొని విజయం సాధించడంలో ఉపాధ్యాయుల కృషి గణనీయమైనది. నూతన విద్యా విధానం-2020లో కూడా ఉపాధ్యాయుల పని పరిస్థితులు, వృత్తిపరమైన నిరంతర అభివృద్ధి, కెరీర్ పురోగతికి సంబంధించిన నియమాలు, జీతభత్యాలు, జవాబుదారీతనం మొదలైన వాటిని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్న పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాలలో కూడా అక్షరాస్యత, విద్యారంగం అభివృద్ధి... ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమౌతుంది. రాష్ట్ర విద్యా రంగంలో దాదాపు సగ భాగంగా ఉన్న ప్రైవేటు విద్యా రంగంలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల పని పరిస్థితులు, వేతనాలు, సర్వీస్ నిబంధనలు మెరుగు పడవలసిన అవసరం ఉన్నది. ప్రత్యేకించి ప్రస్తుతం కరోనా సంక్షోభ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్యం ప్రైవేటు రంగంలో పని చేస్తున్న ఉపాధ్యాయులను, అధ్యాపకులను ఆదుకోవాలి. ఆర్థిక సాయం అందించాలి.
* కె.యస్. లక్ష్మణరావు (శాసనమండలి సభ్యులు, సెల్ : 94402 62072










