Aug 01,2021 06:30

  • కామ్రేడ్‌ లావు బాలగంగాధరరావు శత జయంతి

    గష్టు 3న కామ్రేడ్‌ లావు బాలగంగాధరరావు శత జయంతి. కమ్యూనిస్టు ఉద్యమానికి విశిష్ట స్థానం గలిగిన గుంటూరు జిల్లా కమ్యూనిస్టు యోధుల్లో లావు బాలగంగాధరరావు ఒకరు. ఆయన గుంటూరు జిల్లా తెనాలి క్రాప గ్రామంలో 1921 ఆగస్టు 3న జన్మించారు. తండ్రి లావు సుబ్రహ్మణ్యం, తల్లి లక్ష్మీకాంతమ్మ. ఎల్‌బిజి అని పిలుచుకునే లావు బాలగంగాధరరావు శత జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో ఆగష్టు 15 నుండి సెప్టెంబర్‌ 15 వరకు నెల రోజులపాటు రాష్ట్ర వ్యాపితంగా సభలు, సమావేశాలు నిర్వహించి ఉత్తమ కమ్యూనిస్టు సాంప్రదాయాల్ని యువతలో ప్రచారం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.
    నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అండగా ఆంధ్ర ప్రాంతం నుండి అనేక మంది కమ్యూనిస్టు యోధులు వెళ్ళారు. ఆంధ్రా నుండి వెళ్ళినవారిలో సుమారు 300 మంది పోరాటం సందర్భంగా అటు తెలంగాణలో గానీ, ఇటు ఆంధ్ర ప్రాంతంలో గానీ కాల్చివేయబడ్డారు. ఇంతటి మహత్తర ఘట్టంలో భాగస్వాములైన వారిలో ఎల్‌బిజి ఒకరు. ఆయన నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ-అమ్రాబాద్‌ రీజియన్‌ కార్యదర్శిగా ఉంటున్నప్పుడు నిర్బంధం తీవ్రం కావడంతో దళం అమ్రాబాద్‌ ఫారెస్టుకు వచ్చింది. సైన్యంలో పని చేసిన కా||జైపాల్‌ సింగ్‌ ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ దళాలకు కొంతకాలం శిక్షణ ఇచ్చారు. అలా ట్రైనింగ్‌ పొందిన దళాల్లో కొందరు ఎల్‌బిజి తో కలిసి పనిచేశారు. కొరియర్‌ కాపలా కాస్తున్న సమయంలో ఏమరపాటు వల్ల తుపాకి పేలి...గంగాధరరావు కాలిలో నుండి బుల్లెట్‌ దూసుకుపోయింది. రక్తం ఆగకుండా కారుతూనే వుంది. సహచర సభ్యులు అడవిలో ఆకు రసంతో కట్లుగట్టారు. నాలుగు వేల మంది ప్రాణాలు బలిదానం చేసి, 10 లక్షల ఎకరాల భూములు పంచి దేశం లోనే రైతాంగ ఉద్యమానికి తలమానికంగా నిలబడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు లావు బాలగంగాధరరావు. ఎన్నో నిర్బంధాల మధ్య తెగించి పని చేశారు. పార్టీ పిలుపుతో తన వాటా 4 ఎకరాల పొలం అమ్మి వచ్చిన డబ్బును పార్టీకి ఇచ్చారు.
 

                                                      ఎల్‌బిజి కాలంలో కమ్యూనిస్టు పార్టీ

    అహ్మదాబాద్‌లో 1921లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ సదస్సులో సంపూర్ణ స్వాతంత్య్రం నినాదాన్ని మొదటగా కమ్యూనిస్టులే లేవనెత్తారు. కార్మికులకు, రైతులకు వర్గ ప్రాతిపదికన సంఘాలు ఏర్పర్చి నాయకత్వం వహించిందీ కమ్యూనిస్టులే. దేశ స్వాతంత్య్రం అంటే భారతదేశ ఆర్థిక, సామాజిక విముక్తితోపాటు పూర్తి రాజకీయ స్వాతంత్య్రం అనే చిత్రాన్ని ఇచ్చింది కూడా కమ్యూనిస్టులే. బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటం, జమిందార్ల వ్యతిరేక పోరాటం మేళవించి సాగించింది కూడా కమ్యూనిస్టులే. అందుకే నాడు యువతీ, యువకులు పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. బ్రిటీష్‌ దోపిడీ, జమిందార్ల దోపిడీ పోవాలన్న ఆకాంక్ష నుండే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటర ఆవిర్భవించింది. ఇది ఒక గొప్ప సైద్ధాంతిక అంశం. ఒక ఉన్నత ఆశయం. అక్టోబర్‌ విప్లవం రష్యాలో సోషలిజం వైపు పురోగమిస్తున్న తరుణంలో జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు మహోన్నతమైన కృషి చేశారు. సుందరయ్య మొదలు చాలా మంది కమ్యూనిస్టులకు...దేశ ప్రజల అవసరాల ముందు తమ సొంత ఆస్తులు, కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ అంశమే ఎల్‌బిజి ని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్ష భాగస్వామిని చేసింది.
 

                                                                 ఎల్‌బిజి తో పరిచయం...

    పార్టీలో 1967లో-1968లో అతివాద పెడ ధోరణి వచ్చినప్పుడు కొచ్చిన్‌లో పార్టీ మహాసభ జరిగింది. ఆ మహాసభ నుండి సరాసరి గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగిన విద్యార్థి రంగ రాజకీయ పాఠశాలకు క్లాసులు బోధించడానికి సుందరయ్య, బి.టి రణదివే, బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, నండూరి ప్రసాదరావుతో పాటు ఎల్‌బిజి హాజరయ్యారు. నెల్లూరు నుండి వచ్చిన 12 మంది విద్యార్థుల్లో నేను ఒకడిని. ఇప్పుడు హైదరాబాద్‌లో ఆల్‌మండ్‌ హౌస్‌ యజమానిగా వున్న నాగార్జున, డా|| సుధాకర్‌, డా|| ఉష, డా|| కళాధర్‌, డా|| మిత్రా లు పాఠశాలకు హాజరైన 85 మందిలో ఉన్నారు. నేను ఎల్‌బిజి ని మొదట చూసింది ఈ క్లాసుల్లోనే. 10 రోజులు జరిగిన క్లాసులకు ఆయనే బాధ్యత వహించారు. మేము నెల్లూరులో వేసిన కరపత్రాలను ఆయన నా దగ్గర తీసుకున్నారు. దేశంలో విద్యార్థి ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న రోజులవి. 'విద్యార్థులకు రాజకీయాలు వద్దు' అని ప్రకటనలు చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి నెల్లూరు టౌన్‌హాలులో ''విద్యార్థి కాంగ్రెస్‌'' సభలకు హాజరయ్యారు. కాంగ్రెస్‌ విధానాన్ని విమర్శిస్తూ మేం కరపత్రం వేశాం. ''అధికార పార్టీకి వంత పాడే రాజకీయాలైతే ఉండవచ్చుగానీ, నిరక్షరాస్యత నిర్మూలన, నిరుద్యోగులకు ఉపాధి, వ్యవసాయదారులకు ఆదాయాలు, కార్మికులకు రక్షణ కోరే రాజకీయాలు మాత్రం ఉండకూడదా?'' అని కరపత్రంలో ప్రశ్నించాం. 10 మందిమి రహస్యంగా విద్యార్థి కాంగ్రెస్‌ సభ లోకి దూరి ఆ కరపత్రాలు విరివిగా పంచాం. పోలీసులు అందరినీ ఎత్తి బయటపడేశారు. ఈ కరపత్రాన్ని ఎల్‌బిజి చదివారు. నన్ను వివరాలు అడిగారు. తరువాత కొంత కాలానికి 1969 డిసెంబర్‌లో నన్ను మోటూరు హనుమంతరావు పిలిచి రాష్ట్ర కేంద్రానికి పూర్తికాలం కార్యకర్తగా రమ్మని కోరారు. కార్యకర్తల ఎంపిక, తప్పొప్పులు దిద్దడానికి అవసరమైన సమీక్షలు చేయడంలో ఎల్‌బిజి ది ప్రత్యేకమైన పాత్ర. ఇలాంటి ఉదాహరణలు చాలానే చెప్పవచ్చు.
 

                                                                కమ్యూనిస్టు ప్రమాణాలు

    కార్పొరేట్‌ సంస్కృతితో తేలికగా డబ్బు సంపాదన, రియల్‌ ఎస్టేట్‌, వినిమయదారీతత్వం వంటి జాఢ్యాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో కమ్యూనిస్టు ప్రమాణాలు పలచబడ్డాయి. నాడు ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటం అన్న ఒకే ఒక్క నినాదం చాలా మందిని ఐక్యం చేసింది. నేడు ఎన్నో నినాదాలు, ఎన్నో తరగతుల సమస్యలపై పోరాడితే తప్ప ఐక్యత సాధ్యంగావడం లేదు. పైగా తేలిగ్గా డబ్బు సంపాదన, అవినీతి అన్ని మూలలకు విస్తరించి ఉండడం కమ్యూనిస్టు ప్రమాణాలు బలహీనపడ్డానికి కారణం. కమ్యూనిస్టు ప్రమాణాలకు బలంగా కట్టుబడి ఉంటే తప్ప ప్రజా పంథా సాధ్యంగాదు. కమ్యూనిస్టు ప్రమాణాల ప్రాధాన్యతను గుర్తు చేసేదే ఎల్‌బిజి జీవితం. అందుకే నెలరోజుల క్యాంపెయిన్‌.
 

                                                                          నిర్మాణ దక్షత

    'పార్టీ నిర్మాణం-ప్రజా సంఘాలు' అన్న పుస్తకాన్ని ఎల్‌బిజి రచించారు. అందులో పార్టీ కార్యకర్తలు, సభ్యులు పాటించాల్సిన కమ్యూనిస్టు ప్రమాణాల గురించి అనేక విషయాలు రాశారు. పార్టీ సభ్యులు కమ్యూనిస్టు ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సందర్భం వచ్చిన ప్రతిసారీ చెప్పేవారు. ''మన పార్టీ నిర్మాణంలో వున్న లోపాలనూ, బలహీనతలను'' ఎప్పటికప్పుడు వదిలించుకుని నిజమైన ప్రజా విప్లవ పార్టీగా రూపొందించాలని ఆయన పుస్తకంలో రాశారు. ''ప్రజా బాహుళ్య విప్లవ పార్టీగా రూపొందే విషయంలో మన లోపాలు గుర్తించి, ఆత్మ విమర్శ చేసుకుంటూ అభివృద్ధి చెందాలి'' అని పేర్కొన్నారు. విమర్శలకు వెరవకూడదని చెప్పేవారు.
 

                                                      ఎల్‌బిజి వారసత్వ స్ఫూర్తితో శాఖా మహాసభలు

    పార్టీ 23వ అఖిల భారత మహాసభలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పార్టీ శాఖా మహాసభలు రాష్ట్రంలో జులైౖ 15 నుండి ఆగష్టు 30 వరకు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ మహాసభల్లో కింది స్థాయిలో పార్టీ స్వతంత్ర కార్యాచరణ ఏ రీతిలో సాగిందో సమీక్షించుకోవాలి. ప్రజా సమస్యల మీద ఉద్యమాలు, పోరాటాలు ఎలా జరిగాయో సమీక్షించాలి. ప్రత్యేకంగా స్థానిక సమస్యలపై కృషి ఎలా ఉందో, బూర్జువా పార్టీలకు భిన్నంగా పార్టీ ఎలా వ్యవహరించిందో పరిశీలన జరగాలి. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు వంటి తరగతుల సమస్యలపై జరిగిన కృషి ఏమిటో పరిశీలన చేసుకోవాలి. కమ్యూనిస్టు ఉద్యమానికి విమర్శ, ఆత్మ విమర్శ గుండెకాయ వంటిది. సరైన విశ్లేషణ పార్టీ నిర్మాణానికి పదునుబెడుతుంది. పార్టీ సమరశీలంగా ఉండడానికీ తోడ్పడుతుంది. అందుకే 5 కనీస కర్తవ్యాలను అమలు జరిపినవారే పార్టీ సభ్యులుగా కొనసాగడానికి అర్హులని పార్టీ కేంద్ర కమిటీ పేర్కొన్నది. పార్టీ పెరగాలంటే సభ్యుల నాణ్యత కీలకం. నాణ్యత లేని సభ్యులు ప్రజా ఉద్యమంలో ప్రభావం చూపలేరు. కొత్తవారిని ఆకర్షించలేరు. 'ఆయన లేకపోతే ఇంకెవరూ ఉండరు' అన్నట్టు వ్యవహరించడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. క్రీయాశీలంగా ఉండకపోయినా కొనసాగించాలన్న ధోరణి పార్టీ పురోగమనానికి ఆటంకమని పార్టీ కేంద్ర కమిటీ 2002 డిసెంబర్‌ సర్క్యులర్‌లో పేర్కొన్నది. 5 నిబంధనలు పెట్టింది.
సభ్యత్వ పునరుద్ధరణ సమయంలో ప్రతి సభ్యుడూ పునరుద్ధరణ పత్రం నింపాలనీ, ఇతర వివరాలతో పాటు తన ఆదాయం వివరాలు ఉండాలని కోరింది. 2002 డిసెంబర్‌ 28న పార్టీ కేంద్ర కమిటీ విడుదల చేసిన సర్క్యులర్‌ పార్టీ సభ్యుడి ఆర్థిక క్రమశిక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత ఇది. ఏ సభ్యుడైనా పార్టీ, ప్రజా సంఘాల కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా, లెవీ చెల్లించకపోయినా, సభ్యత్వం నుండి తొలగించాలని పేర్కొన్నది. ఇలా పేర్కొనడంలో ఉద్దేశం పార్టీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలన్నదే. క్రియాశీలకంగా ఉన్న పార్టీ సభ్యులే పిలుపుల్ని అందుకొంటారు. నిర్ణయాల్ని అమలుజేయగలుగుతారు. పార్టీ రాజకీయ సైద్ధాంతిక విధానాలకు అనుగుణంగా వ్యక్తిగత జీవితంలోనూ ప్రవర్తించగలుగుతారు. ప్రజల్లో ఉన్న వెనకబడ్డ భావజాలం ఆధారం చేసుకునే బిజెపి మతోన్మాద శక్తులు బలపడుతున్నాయి. దాన్ని ఎదుర్కోవాలంటే పార్టీ సభ్యులు నిత్య జీవితంలో మూఢనమ్మకాలు, కుల, మత సంబంధమైన ఆచారాలను త్యజించాలని పార్టీ కేంద్ర కమిటీ కోరింది. అందుకు సాంస్కృతికోద్యమాన్ని బలపర్చుకోవాలి. ఎల్‌బిజి శత జయంతి సందర్భంగా పార్టీ సభ్యులు ఈ మహాసభలను పురస్కరించుకొని...తిరోగమన భావజాలానికి వ్యతిరేకంగా పోరాడడం ఒక ప్రధాన కర్తవ్యం కావాలి.
 

                                                           పోరాటాలకు పెరుగుతున్న అవకాశాలు

    ఇటీవలి పరిణామాలు అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. సోవియట్‌ పతననానంతరం ఏకపక్షంగా సాగిన రోజులు గతించాయి. అమెరికా తరువాత, రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించడం అమెరికా ఆధిపత్యం లోని ప్రపంచీకరణను అడ్డుకొంటూ చైనా సాధిస్తున్న అభివృద్ధి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది.
    దేశంలో బిజెపి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలపై జరుగుతున్న ప్రతిఘటన గొప్పది. ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రయివేటీకరణకు ప్రతిఘటన పెరుగుతోంది. రాష్ట్రాల హక్కులు హరింపునకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని రాజ్యాంగ సంస్థలు సిబిఐ, ఎన్‌ఐఎ, సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్‌, సమాచార హక్కు కమిషన్‌ లాంటి సంస్థల స్వతంత్రతను దెబ్బతీయడం...ఉపా, దేశద్రోహం వంటి చట్టాలతో నిరసనను అణచివేయడం ఎక్కువైంది. పెగాసస్‌ నిఘా కుంభకోణం నేడు దేశాన్ని ఊపేస్తున్నది. మతతత్వాన్ని రెచ్చగొట్టే అనేక చర్యలు చేపట్టబడ్డాయి. వీటికి ప్రతిఘటనలు పెరిగాయి.
     రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్షం లోని తెలుగుదేశం, జనసేన అందరూ బిజెపి నే బలపరుస్తున్నారు. మన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే కేంద్ర బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం రాష్ట్రంలో కీలకం. సంక్షేమం అవసరమే అయినా రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆదాయాలు పెరగకపోవడం ముఖ్యమైన అంశం. అలాగే కార్మికులకు కనీస వేతనాలకు గ్యారెంటీ ఇచ్చే మినిమమ్‌ వేజెస్‌ బోర్డు సిఫార్సులు లాంటివి లేవు. కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల ఆదాయాలు గ్యారెంటీ, ఉపాధి కోసం ఎదురు చూసే యువతీ యువకులకు కొత్త ఉద్యోగాలు లాంటివి ప్రాధాన్యత కలిగిన అంశాలు. విధానాల ప్రాతిపదిక మీద ప్రజా సమస్యల మీద పోరాడుతూ మన ప్రత్యేకతను రుజువు చేసుకోవాలి. ప్రత్యేకంగా స్థానిక సమస్యలను ప్రతి శాఖ తీసుకొని పని చేయాలి. పార్టీ శాఖలను, ప్రజా సంఘాల కార్యకలాపాలను బలపర్చుకోవడమే...నేడు లావు బాలగంగాధరరావు శత జయంతి సందర్భంగా... ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి.

/ వ్యాసకర్త సిపియం రాష్ట్ర కార్యదర్శి /

పెనుమల్లి మధు

పెనుమల్లి మధు