Nov 14,2023 21:38

ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న తమ్మినేని సూర్యనారాయణ

ప్రజాశక్తి-దత్తిరాజేరు :  దత్తిరాజేరు మండలంలోని చిన్న చామలాపల్లి వద్ద తలపెట్టిన కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణాన్ని నిలుపుదల చేయాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో గొర్రెల మేకల పెంపకందార్ల జీవనోపాధి దెబ్బతింటుందని అన్నారు. సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం తాహశీల్దార్‌ కార్యాలయం ఎదుట గొర్రెల మేకల వృత్తిదారులు నిరసన చేపట్టారు. ఈసందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కెవికె నిర్మాణం కోసం చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియ నిలిపివేయాలని తాహశీల్దార్‌, ఆర్‌డిఒ, కలెక్టర్‌కు వినతులు ఇచ్చినప్పటికీ మొండిగా భూసేకరణకు సిద్ధం కావడం దుర్మార్గపు చర్య అన్నారు. వృత్తిదారుల జీవనోపాధిని తుంగలో తొక్కడం అంటే జీవించే హక్కును హరించడమేనని అన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో సేకరణ చేపట్టిన భూములు ఉన్నాయని, ఆయా భూముల్లో నిర్మాణం చేపట్టాలని అన్నారు. స్థానిక నాయకులు, అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం వెనక్కి తగ్గే విధంగా ఇక్కడ పరిస్థితులను వివరించాలని సూచించారు. చిన్న చామలాపల్లి కొండ పోరంబోకు భూమి వద్దకు వస్తే వృత్తిదారులు ఊరుకోరని, వారికి సిపిఎం అండగా ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమౌతామని, కాదని ముందుకెళ్తే రాష్ట్రస్థాయి ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వృత్తిదారులకు అండగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని కోరారు. అనంతరం తాహశీల్దార్‌కు వినతి అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.లక్ష్మి, నాయకులు జి.శ్రీనివాస్‌, రాకోటి రాములు, యాదవ సంఘ నాయకులు ఎరుకు నాయుడు, తిరుపతి, పలువురు వృత్తిదారులు పాల్గొన్నారు.