Sep 08,2020 08:28


కరోనా కష్టాల్లో ప్రజలు ఉండగా ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇదే అదనుగా భావించి, సంస్కరణల పేరుతో వినాశకర విధానాల వేగం పెంచింది. రాష్ట్రాలు అప్పులు తెచ్చుకోవడానికిగాను రుణ పరిమితిని పెంచాలంటే ప్రమాదకరమైన షరతులు అమలు చేయాలని ఒత్తిడి చేస్తోంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని వ్యతిరేకిస్తుండగా రాష్ట్రంలో వైయస్సా ర్‌ ప్రభుత్వం మాత్రం కేంద్రం ఒత్తిళ్లకు లంగిపోతోంది. పైపెచ్చు పంపుసెట్లకు మీటర్లు బిగించే 'విప్లవాత్మక' చర్యలకు ముఖ్య మంత్రి పూనుకున్నారని, దేశంలోనే సంస్కరణలు అమలు చేస్తున్న తొలి ముఖ్యమంత్రి అని సి.ఎం సలహాదారు అజ‌య్‌ క‌ల్లాం ప్రకటించారు. దీనినిబట్టి మోడీ ప్రభుత్వం పెట్టిన షరతులను వ్యతిరేకించక పోవడమే కాదు, వాటిని ఆమోదించి వేగంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తేటతెల్లం అయిపోయింది.
ఉచిత విద్యుత్‌ కొనసాగేనా?
గ్యాసు నగదు బదిలీలో ఎంత మోసం జరిగిందో రేపు విద్యుత్‌ నగదు బదిలీలో కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. మొదట్లో అన్ని రికార్డులు ఒకరి పేరుతో లేవనే సాకు లు చెప్పి కొంతమందికి డబ్బు జమ చేయరు. క్రమంగా తెల్లకార్డు లేదని, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఉందని నిబంధనలు చెప్పి నగదు బదిలీ పొందేవారి జాబితాని మరింత కుదిస్తారు. కోటీశ్వరుడి పొలం కౌలు చేసే రైతుకు నగదు బదిలీ ఎలా జరుగుతుంది? విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు సకాలంలో ఇవ్వట్లేదని చెబుతున్నారు. మరి అదే ప్రభుత్వం భవిష్యత్తులో రైతులకు సకాలంలో నగదు బదిలీ చేస్తుందనే గ్యారెంటీ ఏమిటి? ఇప్పటివరకు ఉచిత విద్యుత్‌ రైతులకు హక్కుగా వుంది. రేపు నగదు బదిలీ పాలకుల దయాదాక్షిణ్యంగా మారుతుంది. నగదు బదిలీ చేసి అది కూడా తమ సంక్షేమ పథకాల గొప్పతనమని చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తారనడంలో ఆశ్చర్యం లేదు.
దాడి రైతులతోనే ఆగదు
అప్పు కోసం షరతులతో పాటు, కేంద్ర విద్యుత్‌ చట్టానికి సవరణలు చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీని ప్రకారం ఇళ్లతో సహా మొత్తం విద్యుత్‌ వినియోగించే ప్రజలందరి పైన భారాలు పెరుగుతాయి. ఒకటే శ్లాబు ఉండాలని కేంద్రం చట్టం చెబుతోంది. విద్యుత్‌ తయారీ, పంపిణీ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, అంతా చార్జి రూపంలో అందరి దగ్గరా వసూలు చేయాలని నిబంధన పెడుతున్నారు. దీని ప్రకారం రూ.5.50 పైసలు తక్కువ స్లాబు ఉండదు. ప్రతి ఆరు నెలలకు ఖర్చు పెరిగినప్పుడల్లా చార్జీలు మరింత పెరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలు, చేనేత, వృత్తిదారులు, ఆక్వా, చిన్న పరిశ్రమలు ఇతర తరగతులకు ఇక రాయితీలు హుళక్కే. మరోవైపు విద్యుత్‌ పంపిణీ చేసే సంస్థలను ముక్కలుగా చేసి ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని కొత్త బిల్లు చెబుతోంది. ఇప్పటికే ప్రైవేటు సంస్థల నుండి అధిక రేట్లకు విద్యుత్‌ కొనుగోలు చేసి వినియోగదారుల జేబులు కొడుతున్నారు. రేపు పంపిణీ కూడా ప్రైవేటు కంపెనీల చేతిలోకి పెడితే వారి దోపిడీని అరికట్టే నాథుడెవరు? ప్రైవేటు కంపెనీల వారి కోసమే పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారని అనుమానించడంలో తప్పు లేదు. రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసి నేరుగా విద్యుత్‌ సంస్థలకు బదిలీ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేట్‌ కంపెనీలు వచ్చిన తర్వాత వారికి డబ్బు జమ కాకపోతే రైతులకు విద్యుత్‌ ఇస్తారా? అనుమానమే. బ్యాంకులో డబ్బు జమ అయితే అప్పటికే ఉన్న అప్పులు జమ చేసుకోరని గ్యారంటీ ఉందా? కొత్త ప్రతిపాదనల ప్రకారం విద్యుత్‌ ఛార్జీలను నిర్ణయించే కమిషన్‌పై కేంద్ర ప్రభుత్వానిదే పెత్తనం. ఇప్పటికే 'విద్యుత్‌ చార్జీల నిర్ణయం మా చేతిలో లేదు. రెగ్యులేటరీ కమిషన్‌ నిర్ణయిస్తుంద'ని పాలకులు చెబుతున్నారు. రేపు కేంద్ర మార్గదర్శక సూత్రాల ప్రకారం రేట్లు తయారు చేసి అమలు చేస్తే, తమ చేతిలో ఏమీ లేదని రాష్ట్ర పాలకులు చేతులు ఎత్తేయరా? గత అనుభవా లను దృష్టిలో పెట్టుకుంటే ఇది జరిగే ప్రమాదమే ఉంది. చార్జీలు పెరగటమే కాదు మౌలిక విధానాలే మారుతు న్నాయి. అందులో తొలి అడుగు పంపుసెట్లకు మీటర్లు.
మున్సిపాలిటీలలో పన్నుల వేట
స్థానిక సంస్థలలో ఆదాయం తక్కువగా ఉన్నదని, పన్నులు నిరంతరం పెంచాలని, ప్రతి పనికి రేటు కట్టి యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని కేంద్రం మరో షరతు విధించింది. దీనిని అమలు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కదులుతోంది. ఇప్పటివరకు ఇంటి అద్దె విలువ ఆధారంగా ఇంటి పన్ను విధిస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వెయ్యాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనితో పట్టణాలలో ఇంటి పన్నులు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఆస్తి విలువ ఎప్పటికప్పుడు పెరుగుతుంది కాబట్టి, ప్రతి సంవత్సరం ఈ పన్నులు అధికమవుతాయి. తాత్కాలికంగా స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆగినా రంగం సిద్ధమౌతోంది. ఇదే కాకుండా మంచి నీరు, భూగర్భ డ్రైనేజీ చార్జీలు, చెత్త పన్ను, ట్రేడ్‌ లైసెన్సులు తదితర రూపాలలో పౌర సదుపాయాల కల్పనకు అయిన ఖర్చు మొత్తాన్ని యూజర్‌ చార్జీల రూపంలో రాబట్టటానికి సర్వ సన్నాహాలు చేస్తున్నారు.
మరెన్నో నగదు బదిలీలు
రేషన్‌ బియ్యం వద్దనుకునే వారికి డబ్బు ఇవ్వడం, నగదు బదిలీ విషయం పరిశీలిస్తున్నామని మంత్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 'ఒకే దేశం, ఒకే రేషన్‌' పేరు చెప్పి, వలస కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తూ, దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చని నమ్మబలుకుతోంది. పైకి రేషన్‌ గురించి చెప్పినా ప్రజా పంపిణీని నీరుగార్చేలా, నగదు బదిలీ చేసి చేతులు దులుపుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తోంది. బియ్యం నాణ్యత లేక కొందరు తినలేక అవస్థలు పడుతున్నారు. అటువంటి వారికి బియ్యం బదులు డబ్బులు ఇస్తామని ఎర చూపి మోసగించే ప్రయత్నాలు ప్రారంభించారు. బియ్యం బదు లు కిలోకు పది, ఇరవై రూపాయలు జమ చేసి ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవచ్చు. మార్కెట్లో బియ్యం కొనలేక పేదలకు ఆహార భద్రత లోపిస్తుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రజా పంప ిణీ వ్యవస్థను నాశనం చేస్తే పేదలు దెబ్బతింటారు. బియ్యమే కాక ఏ సరుకులు ఇవ్వరు. కరోనా కష్టకాలంలో కొంతలో కొంతైనా ఆదుకున్న పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి.
'సులభతర వ్యాపారం' పేరుతో చర్యలు చేపడితే రాష్ట్రాలు అప్పులు తీసుకోవటానికి అవకాశం పెరుగుతుందని మరో నిబంధన కేంద్రం పెట్టింది. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే నిర్వీర్యమైన కార్మిక శాఖ ప్రస్తుతం అస్తిత్వం కోల్పోతున్నది. అసంఘటిత కార్మికులు, కనీస వేతనాలు విషయం గత పాలకుల వలె వీరు నోరు మెదపడం లేదు. కార్మిక సంక్షేమ నిధులను మల్లించేస్తున్నారు. పెట్టుబడిదారులకు భూములు, రాయితీలు ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు. సోలార్‌ విద్యుత్‌ పేరుతో తెలుగు దేశం పార్టీని మించి బడా కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి జీవోలు జారీ చేశారు. ప్రైవేట్‌ విద్యుత్‌ కంపెనీల ఒప్పందాల పున:సమీక్షపై హడావిడి చేసిన తర్వాత మౌనం వహిస్తున్నారు. అప్పుల కోసం విదేశీ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. వడ్డీల భారమే కాకుండా విషమ షరతులతో ప్రజల భవిష్యత్తు దెబ్బ తింటుంది. రాజకీయ కక్షలు, వ్యక్తిగత తగాదాలు తప్ప ప్రధాన పార్టీల మధ్య విధాన పరమైన తేడాలు లేవని ప్రజలు గమనిం చాలి.రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్‌ జియో తదితర కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని, వైఎస్సార్‌ చేయూత లాంటి సంక్షేమ పథకాలతో ముడి పెట్టి మహిళలకు వ్యాపార శిక్షణ ఇవ్వటానికి పూనుకుంటున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌తో ఒప్పందాలు చేసు కున్న రిలయన్స్‌ రాష్ట్రంలో రిటైల్‌ మార్కెట్‌లో ప్రవేశించడానికి ప్రభుత్వమే అధికారికంగా దారులు చూపుతోంది.
ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, జీఎస్టీ బకాయిల చెల్లింపు, రాష్ట్రాల హక్కుల హరణం వంటి అంశాలపై వైఎస్సార్‌ ప్రభుత్వం కేంద్రంతో మెతక వైఖరి అవలంబించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతోంది. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఒక విధంగా బిజెపికి జనసేన అధికార మిత్రపక్షంగా ఉండగా...వైసిపి, టిడిపి అనధికార మిత్రపక్షాల వలె వ్యవహరిస్తున్నాయి. 'కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తే, షరతులు పెడితే అంగీకరించక తప్పదు కదా' అనే వాదనలు వినిపిస్తున్నారు. ఎన్‌ఆర్‌సి కి వ్యతిరేకంగా ప్రజల ఒత్తిడి మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపక తప్పలేదు. అదే తీరులో కేంద్ర ప్రభుత్వ షరతులపై మంత్రివర్గం, అసెంబ్లీ ఎందుకు తీర్మానం చేయకూడదు? ప్రజా ప్రయోజనాల కోసం షరతులు అమలు చేయకుండా నిరసనగళం ఎందుకు విప్పకూడదు? కానీ ఆ చిత్తశుద్ధి పాలకులకు లేదు. ఈ నేపథ్యంలో సిపిఎం, వామపక్షాలు కేంద్ర బిజెపి విధానాలపై నికరంగా పోరాడుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలపై సూత్రబద్ధ వైఖరితో ప్రజలను సమీకరిస్తున్నాయి. ప్రస్తుతం సంక్షేమ పథకాల భ్రమల్లో ప్రజలను ఉంచి, ప్రమాదకరమైన విధానాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజలు అప్రమత్తమై ప్రధాన ముద్దాయి అయిన బిజెపి ప్రభుత్వం పై గళం విప్పాలి. రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన బిజెపి విధానాలకు మద్దతు తెలుపుతున్న వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి చర్యలను నిరసించాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై ఉద్యమించాలి.
సిహెచ్‌. బాబూరావు
(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)