Nov 17,2020 06:26

కాంట్రాక్టు కార్మికుల (క్రమబద్ధీకరణ మరియు రద్దు) చట్టం-1970...అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల (ఉద్యోగం మరియు సర్వీసు కండిషన్ల క్రమబద్దీకరణ) చట్టం-1979...రెండూ రద్దయి వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌లో విలీనమయ్యాయి. కార్మికులకు ఉన్న ఏ హక్కులను తొలగించలేదనీ, చట్టాలను సులభతరం చేశామని మోడీ ప్రభుత్వం చెప్పుకుంది. వాస్తవం మరోలా వుంది. నిజాలు దాచినా, దాగవు. బయట పడతాయి. 

ఇంతకు ముందు ఉన్న కాంట్రాక్టు కార్మికుల చట్టం ప్రకారం 20 మంది లోపు కార్మికులను పనిలో పెట్టుకున్న కాంట్రాక్టరు లైసెన్సు తీసుకోనవసరం లేదు. లైసెన్సు షరతులలో ఉండే కనీస వేతనాలను, సమాన పనికి సమాన వేతనాలను అమలు చేయనవసరం లేదు. కోడ్‌లో ఆ 20 సంఖ్యను మోడీ ప్రభుత్వం 50 కి పెంచింది. ఇక ఇప్పుడు అవి 50 లోపు ఉన్న కాంట్రాక్టు కార్మికులకు కూడా అమలు కావు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం...మోడీ ఆదేశానుసారం...2015 లోనే ఆ సంఖ్యను 50కి పెంచింది. అసెంబ్లీలో జగన్‌ మోహన్‌ రెడ్డి మద్దతు తెలిపారు. 

కాంట్రాక్టు లేబరు చట్టం లోని సెక్షన్‌ 3 ప్రకారం కేంద్రం లోనూ, రాష్ట్రాల లోనూ సెంట్రల్‌ లేబరు అడ్వయిజరీ బోర్డులు, రాష్ట్ర లేబర్‌ అడ్వయిజరీ బోర్డులు ఏర్పాటయ్యాయి. సెక్షన్‌ 10 ప్రకారం వీటి పని పర్మినెంట్‌ పనులలో ఉన్న కాంట్రాక్టు వ్యవస్ధను రద్దు చేయమని సంబంధిత ప్రభుత్వాలకు సిఫార్సు చేయటం. ఇప్పుడు కోడ్‌లో సెంట్రల్‌ లేబర్‌ అడ్వయిజరీ బోర్డును మోడీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఇక కాంట్రాక్టు కార్మికులు పర్మినెంట్‌ అయ్యే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు 2003 లోనే కాంట్రాక్టు కార్మికుల చట్టానికి అసెంబ్లీలో సవరణ చేసి రాష్ట్ర లేబరు బోర్డును రద్దు చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు పార్టీ దీనికి మద్దతు తెలిపింది.

మోడీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ కారణంగా పనులు పోగొట్టుకుని తమ స్వస్థలాకు తిరిగి వెళుతున్న లక్షలాది మంది వలస కార్మికుల దుస్థితి చూసి కరిగిపోని హృదయం అంటూ లేదు. కార్మిక సంఘాలు కూడా అప్పటికి మానవత్వంతో తమకు తోచిన సహాయం చేశాయి. అంతేతప్ప, వలస కార్మికులకంటూ ఒక చట్టం ఉందనీ, అది 1979లో వచ్చిందని, దాని ప్రకారం వారికి ముఖ్యమైన హక్కులు ఉన్నాయనీ...వాటి సాధన కోసం కార్మిక సంఘాలు కదలలేదు. ఇంతకు ముందు వలస కార్మికులకు ఉన్న చట్టం ప్రకారం వలస కార్మికుల కుటుంబానికి నివాస సౌకర్యం కల్పించాలి. తనకు, తనతో ఉన్న కుటుంబం మొత్తానికి ఆసుపత్రి ఖర్చులు, మందుల ఖర్చులు భరించాలి. సొంత రాష్ట్రం నుండి పని చేస్తున్న రాష్ట్రానికి రానూ, పోనూ ప్రయాణ ఖర్చులు చెల్లించాలి. ముఖ్యంగా అదే సంస్థలో అదే పని చేస్తున్న ఇతర కార్మికులకు ఇస్తున్న వేతనాలు, అలవెన్సులు, ఇతర బెనిఫిట్లు ఇవ్వాలి.

కోడ్‌లో వలస కార్మికులకు ఉన్న ముఖ్యమైన హక్కులన్నిటినీ మోడీ ప్రభుత్వం ఎత్తేసింది. ఇతర కార్మికులకు ఇస్తున్న ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ లేదా ఇతర చట్టాల కింద ఉన్న బెనిఫిట్లను మాత్రమే వలస కార్మికులకు ఇవ్వాలని ఉంది. రానూ పోనూ ఖర్చులు భరించాలని ఉంది. కానీ సమాన పనికి సమాన వేతనం, నివాస సౌకర్యం, ఆసుపత్రి సౌకర్యాలను ఎత్తివేశారు. వలస కార్మికుల దుస్థితి చూసి వారిని సంఘటితపర్చాలని కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్న సమయంలోనే వలస కార్మికుల హక్కులు గాలికి ఎగిరిపోయాయి. కోడ్‌లో ఉన్న మిగిలిన కొద్దిపాటి హక్కులు కూడా అమలు కాని విధంగా కోడ్‌ అమలుకు అవసరమైన వలస కార్మికుల కనీస సంఖ్యను మోడీ ప్రభుత్వం 5 నుండి పదికి పెంచింది. కాంట్రాక్టు కార్మికులు, వలస కార్మికులను సంఘటితం చేయకుండా కార్మికోద్యమం ముందుకు పోలేదు. కార్మికులను ఐక్యం చేయలేదు. కాంట్రాక్టు కార్మికులు, వలస కార్మికులకు కడగండ్లు పెంచిన కోడ్లపై నవంబర్‌ 26 సమ్మె సందర్భంగా వారిలో తీవ్రంగా ప్రచారం చేయాలి. వారందరినీ సమ్మెకు సమీకరించాలి.
                                                                  - పి.అజయ కుమార్‌ (సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు)