న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో వచ్చే నెల ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. అదీగాక కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు బిజెపిలోకి చేరడంతో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తాజాగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, మాజీ కేంద్రమంత్రి ఆర్‌పిఎన్‌సింగ్ బిజెపిలో చేరడంపై.. కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. ఒకవైపు ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ ముక్త్ భారత్, కాంగ్రెస్ రహిత భారత్ వంటి నినాదాలు ఇస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్‌తో కూడిన బిజెపిగా కాషాయ పార్టీ మారిందని శశిథరూర్ ఎద్దేవా చేశారు.
ఆర్‌పిఎన్‌సింగ్ పార్టీని వీడడంపై.. కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా స్పందిస్తూ.. 'తన భావజాలానికి కట్టుబడి ఉండలేనివాడు మన స్వంతం కాలేడని' అన్నారు. అలాగే దేశాన్ని 80 శాతం వర్సెస్ 20 శాతంగా విభజించే వారిని ఓడించాల్సిన అవసరం ఉందని ఖేరా కోరారు. మరోవైపు 'కేవలం పిరికివాళ్లే పూర్తి విరుద్ధమైన భావజాలం ఉన్న పార్టీల్లో చేరతారని' కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనటె వ్యాఖ్యానించారు. బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య సైద్ధాంతిక పోరు నడుస్తోందని, ఈ పోరులో నిలిచి గెలవాలంటే.. ధైర్యంగా ముందుకెళ్లాలని ఆయన అన్నారు. అయితే సింగ్ నిష్క్రమణ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
యుపిలో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ విడతల వారీగా పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.










