ప్రజాశక్తి-విజయనగరం కోట : తీవ్ర వర్షాభావంతో వరిపంట ఎండిపోయిన నేపథ్యంలో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ కమిటీ సభ్యులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రైతు గర్జనపేరిట కాంగ్రెస్ ఆధ్వర్యాన గురువారం కలెక్టరేట్ వద్ద రైతులు, ఆ పార్టీ నాయకులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ముందుగా ఎత్తుబ్రిడ్జి వద్దగల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎండిపోయిన వరిదుబ్బులను పట్టుకొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌కు రైతుల బాధలు పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 685 మండలాలు ఉంటే 103 మండలాలను మాత్రమే కరువు మండలాలు ప్రకటించడం అన్యాయమని అన్నారు. జిల్లాలో తీవ్ర స్థాయిలో కరువు తాండవిస్తోందని తెలిపారు. పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దారుపురించిందన్నారు. జిల్లాలో 25మండలాలుంటే ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం దుర్మార్గమన్నారు. 37 వేల ఎకరాల్లో వరి ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు. పంట నష్టాల అంచనాలు వేసి, ఎకరాకు రూ.50వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పశుగ్రాసం, తాగునీరు మెరుగైన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర మాజీ మంత్రి, సిడబ్ల్యుసి సభ్యులు డాక్టర్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే రైతన్న నేడు ఇబ్బందుల్లో పడ్డారన్నారు. అప్పులు చేసి పంటలు పండక తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని తెలిపారు. దేశంలోను, రాష్ట్రంలోను వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు. కనీస నష్టపరిహారం గాని, ఇన్సూరెన్స్ కూడా రావడం లేదన్నారు. తాజాగా రైతుల సాగునీటి మోటర్లకు మీటర్లు పెట్టే కార్యక్రమం దేశంలోను, రాష్ట్రంలోను జోరుగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తూ ఉంటే కరువు మండలాలు ప్రకటన చేయడం లేదన్నారు. తమకు రాష్ట్రంలో బలం లేకున్నా రైతులు పక్షాన పోరాడుతున్నామన్నారు. కలెక్టర్లు ద్వారా సిఎంకు, పిఎంకు వినతులు పంపుతున్నామని తెలిపారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల గురించి కేంద్రానికి నివేదిక కూడా పంపలేదన్నారు. వెంటనే కరువు మండలాలు ప్రకటన చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కరువు నేపథ్యంలో కేంద్రం వెంటనే రాష్ట్రానికి రూ.10వేల కోట్లు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే రాష్ట్రంలో క్వింటాకు రూ.3వేలు తగ్గ కుండా మద్దతు ధర ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డోల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సుంకర సతీష్, ఎపిసిసి వైస్ చైర్మన్ షరీఫ్, జమ్ము ఆదినారాయణ, జిల్లా మైనార్టీ అధ్యక్షులు రెహమాన్, శ్రీనివాసరావు, శ్రీకాకుళం డిసిసి సభ్యులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.