Sep 13,2023 17:02

న్యూఢిల్లీ :   యూనివర్శిటీ యాజమాన్యం తనను వేధిస్తోందంటూ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) ప్రొఫెసర్‌ రాజీవ్‌ కుమార్‌ రాష్ట్రపతికి లేఖ రాశారు. తనపై దాఖలైన దుష్ప్రవర్తన ఫిర్యాదుతో గత 42 నెలలుగా యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందంటూ లేఖలో పేర్కొన్నారు.

ఈ తరహా కేసుల్లో నెలలోపు విచారణ పూర్తి చేయాలని యూనివర్శిటీ నిబంధనలు ఉన్నప్పటికీ.. 2020 ఫిబ్రవరి నుండి విచారణ పెండింగ్‌లోనే ఉంది. యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ సిస్టమ్స్‌ సైన్సెస్‌లో అధ్యాపక సభ్యుడు, ప్రొఫెసర్‌ రాజీవ్‌ తనపై పెండింగ్‌లో ఉన్న విచారణను పేర్కొంటూ తన పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను నిలిపివేస్తారని భయపడుతున్నారు. రాజీవ్‌ కుమార్‌ 2024 మార్చిలో రిటైర్‌ కానున్నారు.
2006లో ఐఐటి ఖరగ్‌పూర్‌లో తన పదవీకాలంలో ఆర్థిక మరియు విధానపరమైన అక్రమాలను వెలికితీసి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (జెఇఇ)లో పారదర్శకతను తీసుకురావడానికి ఆయన చేసిన కృషికి గాను సుప్రీంకోర్టు ''గుర్తింపు కోరని హీరో'' అంటూ ప్రశంసలు కురిపించింది.

ప్రస్తుత యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) చైర్మన్‌ ఎం. జగదీష్‌ కుమార్‌ 2015లో జెఎన్‌యు వైస్‌ఛాన్సలర్‌గా ఉన్న సమయంలోనే ప్రొఫెసర్‌ రాజీవ్‌ కుమార్‌ అక్కడ చేరారు. 2020లో విచారణకు ఆదేశించగా, జగదీష్‌ కుమార్‌ (2016-22) పదవీకాలం పూర్తయినా విచారణ కొనసాగుతుండటం గమనార్హం. 2006లో జెఇఇలో అక్రమాలను వెలికితీసినందుకు జగదీష్‌ కుమార్‌ తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. గతేడాది జనవరిలో ఆయన పదవీవిరమణ చేసినప్పటికీ.. తనపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు.

2020 జనవరిలో జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సమావేశంలో ఇద్దరు ఎక్స్‌టర్నన్‌ నిపుణులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ప్రొఫెసర్‌ రాజీవ్‌ కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి. తమపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని ఆ ఇద్దరు ఫిర్యాదు చేశారు. అయితే వీరిలో ఒకరు ఫిర్యాదును వెనక్కుతీసుకున్నారని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. మరొకరు రిటైర్డ్‌ సభ్యుడని, ఆ సమావేశానికి హాజరయ్యేందుకు అతనికి అర్హత లేదని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పలుమార్లు లేఖలు రాసినా .. సమాధానం రాలేదని అన్నారు. ఈ విషయంపై స్టేటస్‌ రిపోర్ట్‌ కోరుతూ అవసరమైన చర్య కోసం రాష్ట్రపతి తన లేఖను విద్యా శాఖ, యూనివర్శిటీ యాజమాన్యానికి పంపినట్లు రాష్ట్రపతి కార్యాలయం పేర్కొందని అన్నారు. రాష్ట్రపతి నుండి సమాధానం కోసం వేచి చూస్తున్నానని తెలిపారు.