Mar 24,2022 21:43

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలాను నిరసిస్తూ ఈనెల 28,29 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు వామపక్షాలు పార్టీలు మద్దతిస్తున్నాయని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు తమ్మినేని సూర్యనారాయణ, ఒమ్మి రమణ తెలిపారు. గురువారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వామపక్ష పార్టీలన్నీ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. బిజెపి ప్రభుత్వం దేశంలో ఉన్న పరిశ్రమలను, ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతోందని, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై భారాలు వేస్తోందని అన్నారు. ఈ విధానం వల్ల వ్యవసాయ కార్మికులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 44 చట్టాలను 4 కోడ్‌లుగా మార్చి శ్రామిక, కార్మి శక్తిని కారు చౌకగా కార్పొరేట్‌ శక్తులకు ఉడిగం చేస్తోందని అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పరి రక్షణ కోసం ఏడాదిగా కార్మిక సంఘాలు పోరాడుతుంటే పార్లమెంట్‌లో బిజెపి ఎమ్‌పి కార్మికులు పని చేయకపోవడం వల్లనే నష్టం వచ్చిందని కుంటి సాకులు చూపి పోక్స్‌కోకు కట్టబట్టేందుకు సిద్ధమవుతున్నారని వివరించారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు పోరాడాలని పిలుపునిచ్చారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన తర్వాత బిజెపి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి బరితెగింపుకు పాల్పడుతుందని, దీనికి వ్యతిరేకంగా జరిగే సమ్మెను ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు.