.ప్రపంచవ్యాప్తంగా నివశిస్తున్న జనాభాకు ఎన్నో రకాల భాషలుంటాయి. ఉదాహరణకు ఒక్కో తెగకు, ప్రాంతానికి ఆయా రకాల ప్రత్యేక మాండలికాలు.. భాషలు ఉంటాయి. అయితే భాష ద్వారా కేవలం ఆత్మీయ పలకరింపే కాదు.. సమస్యల్ని, సమాచారాన్ని, విజ్ఞానాన్ని పెంచుకోవడానికి కూడా దోహదపడుతుంది. అలాంటిది గ్లోబలైజేషన్‌లో భాగంగా జంతుజాతి నశించిపోతున్నట్లు.. మాట్లాడే భాషలు కూడా అంతరించిపోతున్నాయి. ఉదాహరణగా చెప్పుకోవాలంటే.. మన ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ మన్యంలో ఎన్నో రకాల గిరిజన భాషలు ఒకప్పుడు ఉండేవి. ప్రస్తుతం ఆయా తెగల భాషలు కనుమరుగయ్యాయనే చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21వ తేదీన మాతృభాషా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. కేవలం గ్లోబలైజేషన్ వల్లే భాషలు అంతరించిపోతున్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు అంతరించిపోతున్నాయి? వాటికి గల కారణాలేంటి? వంటి విషయాలపై పరిశోధనలు విస్తృతంగా మొదలయ్యాయి. వాటిలో ఆర్థిక వెనుకబాటుతనం ప్రధానకారణమని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. అంటే.. బతుకుతెరువు కోసం ఒక ప్రాంతం నుంచి.. మరొక ప్రాంతానికి తరలివెళుతున్న జానాభా.. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా వారు కూడా ఆ భాషను నేర్చుకుంటున్నారు. దీంతో.. వారు మాతృభాషని మాట్లాడకపోవడం క్రమేణా అంతరించిపోవడం జరుగుతుంది.
ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా వేలాది భాషలు అంతరించిపోతున్నాయని తాజాగా మాతృభాషలపై విశ్లేషణ చేసిన స్టాటిస్టా ప్రాజెక్టు వెల్లడించింది. ప్రపంచంలో ఒక్క ఓషియానియాలోనే 733 భాషలు కనుమరుగయ్యాయని స్టాటిస్టా తెలిపింది. ఓషియానియా అనేది ఆస్ట్రేలియా, మెలనేషియా, మైక్రోనేషియా, పాలినేషియాలను కలిగి ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం. తూర్పు, పశ్చిమ అర్థగోళాలలో విస్తరించి ఉన్న ఓషియానియా 8,525,989 చదరపు కిలోమీటర్ల భూభాగంతో.. 41 మిలియన్లకు పైగా జనాభా కలిగి ఉంది. ఇక ఆసియా విషయానికొస్తే.. 693 భాషలు ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొంది. అంటే ఆయా భాషలకు అంత ప్రాధాన్యత లేకపోవడమే. ఇక ఆఫ్రికా అయితే దాదాపు 428 మాతృభాషలను కోల్పోనుందట. అలాగే అగ్రరాజ్యమైన అమెరికా, యూరప్‌ల్లో మొత్తం 2,500 మార్క్‌ను చేరుకోనుంది. 2014లో భాషలపై పరిశోధన చేసిన.. అమనో పత్రం ఏం పేర్కొందంటే.. ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలు అంతరించిపోతున్నాయని, ఇది 1970ల నుంచి మొదలై 2023 నాటికి మరిన్ని మాతృభాషలు అంతరించే ప్రమాదముందని సూచించింది.










