Aug 28,2022 21:24

ప్రజాశక్తి-విజయవాడ :సామాజిక మార్పు కోసం కవులు, రచయితలు తమ రచనలను కొనసాగించాలని ఎపి సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీ కళావేదిక కృష్ణాజిల్లా కమిటీ, డాక్టర్‌ బోయి భీమన్న సాహిత్య నిధి ట్రస్ట్‌ సంయుక్తంగా విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె)లో జాతీయ శతాధిక కవి సమ్మేళనం ఆదివారం జరిగింది. శ్రీశ్రీ కళావేదిక జాతీయ కార్యదర్శి పుల్లేటి కుర్తి ఎస్‌వి శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో శ్రీలక్ష్మి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. శ్రీశ్రీ సమాజ అభ్యున్నతి కోసం తుదిశ్వాస వరకూ కృషి చేశారని తెలిపారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన శ్రీశ్రీ కళావేదిక సాహిత్యరంగానికి చేస్తోన్న కృషి అజరామరమన్నారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్‌ డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న అసమానతలు పోవాలన్న, అభ్యుదయం వైపు సమాజం ముందుకు సాగాలన్న శ్రీశ్రీ ఆశయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తమ సంస్థ ద్వారా ప్రపంచంలోని తెలుగు ప్రజలను తెలుగు భాష, దాని అభివృద్ధి వైపు మరలించడానికి నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. ఆదికవి నన్నయ్య తెలుగు విశ్వ విద్యాలయం (రాజమహేంద్రవరం) తెలుగు విభాగాధిపతి డాక్టర్‌ తరపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ కవిత్వం ప్రజలను కదిలించాలన్నారు. సామాజిక అంశాలే ఇతివృత్తాలుగా తీసుకుని తెలుగుభాషా వికాసానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్‌ కొల్లి రమావతి మాట్లాడారు. తొలుత ఎంబివికె నిర్వాహకులు బి.ఆర్‌.తులసీరావు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు అవలంభిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు.