Jul 17,2023 21:34

గాంధీనగర్‌ : ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నుంచి వచ్చిన వారం రోజులకే ఈ రెండు దేశాల ఆర్థిక మంత్రులు భేటీ అయ్యారు. మోడీ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కార్యరూపం ఇచ్చేందుకు జి-20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా వీరిరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. సెప్టెంబరులో జరిగే జి-20 శిఖరాగ్ర సదస్సుకు సన్నాహంగా సోమవారం నాడిక్కడ జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశం వాతావరణ మార్పులపైనా దృష్టి సారించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇంధన పరివర్తనా క్రమానికి అవసరమైన నిధుల సమీకరణకు మార్గాలు అన్వేషించాలని జి 20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల సమావేశం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, తెలిపారు. అమెరికాతో బంధాన్ని మరింత పరిపుష్టం చేసుకోవాలని భావిస్తున్నట్లు సీతారామన్‌ పేర్కొన్నారు. పునర్వినియోగ ఇంధన రంగంలో పెట్టుబడుల కోసం ప్రత్యామ్నాయ వేదికల ద్వారా కృషి చేస్తున్నామని చెప్పారు.
వాణిజ్య, సాంకేతిక సహకారంతోపాటు పలు ఆర్థిక అంశాల్లో ఇరు దేశాల మధ్య సహకారం విస్తరించిందని యెలెన్‌ తెలిపారు. సరఫరా చైన్ల పటిష్టత, స్వచ్ఛమైన ఇంధన పరివర్తన వంటి వాటిలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని చెప్పారు. ''ముఖ్యంగా, పెట్టుబడుల వేదికలపై అలాగే భారత్‌ ఇంధన పరివర్తనను వేగిరపరిచేందుకు ప్రైవేటు పెట్టుబడులను పెంచడంపైనా భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని యెలెన్‌ వివరించారు. చారిత్రాత్మకమైన రెండంచెల అంతర్జాతీయ పన్ను ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడంపై భారత్‌ దృష్టి పెట్టడాన్ని ఆమె అభినందించారు. దాదాపు ఒప్పందం ఖరారు దశకు వచ్చిందని భావిస్తున్నామని చెప్పారు.