Jun 22,2023 16:06

బోస్టన్‌ : అట్లాంటిక్‌ మహాసముద్రంలో తప్పిపోయిన పర్యాటకుల మిని జలాంతర్గామి 'టైటాన్‌' ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. అమెరికా కోస్ట్‌ గార్డ్‌, కెనడా సైనిక విమానాలు, ఫ్రెంచ్‌ నౌకలు, టెలీగైడెడ్‌ రోబోలు భారీ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.
సముద్రంలో సుమారు 4 కి.మీల లోతులో ఉన్న టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఆదివారం బయలుదేరిన టైటాన్‌ కొన్ని గంటల్లోనే తప్పిపోయిన విషయం తెలిసిందే.
కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ రెస్క్యూలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. భారత కాలమాన ప్రకారం, గురువారం సాయంత్రం 7.15నిమిషాల వరకే ఆక్సిజన్‌ సరిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్‌ బిలియనీర్‌ షెహజాదా దావూద్‌ (48), ఆయన కుమారుడు సులేమాన్‌ (19), యూఏఈలో ఉంటున్న బ్రిటిష్‌ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌, ఫ్రెంచ్‌ మాజీ నావికా అధికారి పాల్‌ హెన్రీ ఈ జలాంతర్గామిలో ఉన్నారు.