Jun 22,2023 10:11
  • ప్రపంచ శరణార్ధుల దినోత్సవ తీరిదీ!!

న్యూయార్క్‌ : ప్రతి ఏటా జూన్‌ 20న ప్రపంచ శరణార్ధుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తూ వస్తోంది. సాధికారత, సానుకూలతలను నొక్కి చెప్పడానికి ఐక్యరాజ్య సమితి, అనుబంధ సంస్థలు ఈ రోజును ప్రస్తావిస్తూ వుంటాయి. పశ్చిమ దేశాలు చాలా వరకు శరణార్థుల దినోత్సవాన్ని ఖరీదైన విందులకు, ఆర్భాటపు ప్రకటనలకు పరిమితం చేస్తుంటాయి. శరణార్థుల హక్కులను గుర్తించడం కానీ, వాటి అమలుకు ప్రయత్నించడం కానీ చేయవు. శరణార్థులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శరణార్ధుల సంస్థ (యుఎన్‌హెచ్‌సిఆర్‌) నిర్దేశించిన నియమ నిబంధనలను అవి తుంగలో తొక్కుతున్నాయి. దీనికి వారం రోజుల క్రితం లిబియా నుండి గ్రీస్‌ వెళుతున్న బోటు గ్రీస్‌కు సమీపంలో మధ్యధరా సముద్ర జలాల్లో బోల్తా పడడంతో దాదాపు 500మంది శరణార్ధులు మరణించారు. ఈ మహా విషాదం నుండి కేవలం 104మందిని మాత్రమే కాపాడగలిగారు. గ్రీస్‌, టర్కీ అనుసరించిన విధానాలే దీనికి ముఖ్యకారణం. ఇటువంటి ప్రమాదాలు జరిగినపుడు పత్రికల్లో వచ్చే పతాక శీర్షికలు, వార్తా కథనాలు చెప్పడానికి ప్రయత్నించేదాని కన్నా అత్యంత వాస్తవికతతో కూడిన కథనాలను తాజా విషాదం చెబుతుంది. యుద్ధం, పేదరికం, అసమానతలు, నిరాశా నిస్పృహలతో నిండిన కథనాలే ఇవన్నీ. సముద్రపు ఒడ్డున చెల్లా చెదురుగా పడిన మృతదేహాల్లో సిరియన్లు, పాలస్తీనియన్లు, ఆఫ్ఘన్లు, సూడాన్‌ జాతీయులు ఇంకా చాలామంది వున్నారు. వీరందరూ తమ బతుకుకు భద్రత కోసమే ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాల్లో తమ ప్రాణాలే పోగొట్టుకున్నారు. శరణార్ధుల పట్ల సమాజాలకు, ప్రభుత్వాలకు వున్న నైతికత బాధ్యతల గురించి మేథావులు చెబుతూ వుంటారు, కార్యాచరణ చేపట్టాలని దౌత్యవేత్తలు డిమాండ్‌ చేస్తారు. కానీ కేవలం ఘోష తప్ప అక్కడ జరిగేదేమీ వుండదు. 2014-2022 మధ్య కాలంలో యూరప్‌ దేశాలకు చేరడానికి ప్రయత్నించే క్రమంలో 23వేల మందికి పైగా శరణార్ధులు సముద్ర జలాల్లో మునిగిపోవడమో, గల్లంతవడమో జరిగింది. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే వుంటుంది. ఎందుకంటే ఇటువంటి ప్రాణాంతక ప్రయాణాలకు ఎలాంటి అధికారిక రికార్డులు వుండవు కనుక. బాధితులు ఏ జాతీయులన్న గుర్తింపే ఇక్కడ మనకు పెద్ద క్లూగా వుంటుంది. అప్పుడే వారు ప్రాణాలకు తెగించి ఇటువంటి ప్రయాణాలు ఎందుకు చేశారన్నదీ అర్ధమవుతుంది. కేవలం బతకాలనే ఒకే ఒక్క తలంపుతోనే వారు వర్ణ వివక్షతో సహా అనేక అవమానాలు, వేధింపులు, ప్రమాదాలు అన్నింటినీ సహిస్తారు. ఇంత జరిగినా, ఇటువంటి మానవ మహా విషాదాల వెనుక గల అసలు దోషులను, బాధ్యులను పట్టుకోలేకపోతున్నాం. ఆయుధాల తయారీదారులు, మిలటరీ జోక్యందారులు, ఘర్షణలను రెచ్చగొట్టే రాజకీయ నేతలను అసలైన దోషులుగా నిర్ధారించి సరైన చర్యలు తీసుకున్నపుడు ఇటువంటి ప్రమాదాలు నివారించడానికి అవకాశం వుంటుంది. వీరంతా మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, అంతర్జాతీయంగా పేద, వర్ధమాన దేశాల్లో భౌగోళిక, రాజకీయ ఘర్షణలకు, శతృత్వాలకు అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టినవారే. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మందికి పైగా శరణార్ధులు వున్నారని ఒక అంచనా. ఇదేమీ సంబరాలు చేసుకోవాల్సిన అంశం కాదు, బాధపడాల్సిన విషయం. వారిని ఒక అవకాశంగా కాకుండా, ఒక బరువుగా చూస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి.