బీజింగ్ : వచ్చే వారం భారత్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) సదస్సుకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఈ మేరకు శుక్రవారం చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు జులై 4న నిర్వహించే 23వ ఎస్‌సిఒ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బీజింగ్‌లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరై, ముఖ్యమైన సందేశం ఇవ్వనున్నారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ మీడియాకి తెలిపారు. భారత్ ఆతిథ్యమివ్వనున్న ఎస్‌సిఒ సదస్సులో జిన్‌పింగ్ హాజరుకావడంపై ఇదే మొదటి అధికారిక ప్రకటన.
రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులచే 2001లో షాంఘైలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఎస్‌సిఒ స్థాపించబడింది. 2017లో భారత్, పాకిస్తాన్‌లు ఈ సదస్సులో శాశ్వత సభ్య దేశాలుగా చేరాయి. రొటేటింగ్ పద్ధతిలో ఈ ఏడాది భారత్ ఎస్‌సిఒ సదస్సును నిర్వహించనుంది. భారత అధ్యక్షుడి ఆధ్వర్యంలో మొదటిసారిగా జరగనున్న శిఖరాగ్ర సదస్సుకి ముందు బీజింగ్‌లోని ఎస్‌సిఒ సెక్రటేరియట్‌లో భారత్ నిర్మించిన ''న్యూఢిల్లీ హాల్'' ను మంగళవారం ప్రారంభించింది. సెప్టెంబర్‌లో, భారత్ జి 20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కూటమిలోని ఇతర నేతలతో పాటు జిన్‌పింగ్, పుతిన్‌లను ఆహ్వానించనుంది.










