Feb 07,2023 21:23

దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) ప్రతి నెలా ప్రకటించే 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' రేసులో భారత క్రికెటర్లు ఇద్దరికి చోటు దక్కింది. భారత్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ క్రమంలో వన్డేల్లో డబుల్‌ సెంచరీని, టి20ల్లో సెంచరీని కొట్టి పలు రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన శుభ్‌మన్‌ తొలి రెండు టి20ల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైనా.. మూడో టి20లో 46పరుగులతో రాణించాడు. అదే ఊపులో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌లో 70, 21, 116పరుగులతో సత్తా చాటి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డుకు కైవసం చేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో శుభ్‌మన్‌.. కివీస్‌ స్టార్‌ పేసర్‌ లూకీ ఫెర్గుసన్‌ వేసిన ఒక ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి డబుల్‌ సెంచరీని కొట్టాడు. ఆ తర్వాతి వన్డేలో 40 పరుగులు, మూడో వన్డేలో 112పరుగులతో కదం తొక్కాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్‌ ఓపెనర్‌, కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక హైదరాబాద్‌కు చెందిన శ్రీలంకతో సిరీస్‌లో స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (2/30, 3/30, 4/32) అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఇదే క్రమంలో న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌లోనూ 4/46 మెరిసాడు.