Feb 09,2023 21:01

నాగ్‌పూర్‌: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన కోన శ్రీకర్‌ భరత్‌ రెండేళ్లుగా జాతీయ జట్టుకు ఎంపికవుతున్నా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. ఫుల్‌టైమ్‌ వికెట్‌ కీపర్‌ కోటాలో రిషబ్‌ పంత్‌ తుది జట్టులో చోటు దక్కించుకోవడం.. శ్రీకర్‌ భరత్‌ బెంచ్‌కే పరిమితం కావడం పరిపాటిగా మారింది. ఇటీవల కారు ప్రమాదంలో రిషబ్‌ పంత్‌ తీవ్రంగా గాయపడడంతో నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో భరత్‌ తుది జట్టులో చోటు దక్కించున్నాడు. ఇదే క్రమంలో అరంగేట్ర టెస్టులోనే అద్భుత వికెట్‌ కీపింగ్‌ స్కిల్స్‌తో అదరగొట్టాడు. మార్నస్‌ లబూషేన్‌ను మెరుపు వేగంతో స్టంప్‌ చేసి మాజీ వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని గుర్తు చేశాడు. బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీ తెలుగు కుర్రాడికి స్థానం దక్కడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు నావీలో పనిచేస్తూ ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు.

1


2012లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన భరత్‌ మొత్తం 78 మ్యాచ్‌లు ఆడి తొమ్మిది సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు. 2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ (308) సాధించిన తొలి వికెట్‌ కీపర్‌గా ఘనత సాధించాడు. ఈ ప్రతిభతో భారత 'ఎ' జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారిన భరత్‌ 2015లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌-2021 సీజన్‌ మినీ వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 లక్షలు వెచ్చించి భరత్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మొత్తం 191 పరుగులు సాధించిన భరత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి తన జట్టును గెలిపించి సత్తాను చాటాడు.