Oct 18,2022 12:02

గుంటూరు : పైగంబర కవుల్లో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కవి సుగంబాబు ఇక లేరు. మంగళవారం తెల్లవారుజామున సుగంబాబు కన్నుమూశారు. కవిగా సొంత ముద్ర ఉన్న వారు. పైగంబర కవుల్లో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారు. 7 పుస్తకాలు తీసుకొచ్చారు. తాత్వికత, సరళత, స్పష్టతా, క్లుప్తతా ఆయన కవిత్వ లక్షణాలు. వామపక్ష విప్లవ భావాల ప్రభావంతో జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే అవసరమైనచోట వాటి పరిధి దాటి జీవితాన్ని వ్యాఖ్యానించినవారు సుగంబాబు. ' రెక్కలు ' అనే కొత్త కవిత్వ ప్రక్రియను రూపొందించి సాధన చేసి కొంతమంది అనుయాయీలను కూడా పొందారు.

గుంటూరుకు చెందిన సుగంబాబు కవి తన ప్రధాన జీవితాన్ని హైదరాబాద్‌లోనే గడిపారు. విలేకరిగా ఉంటూనే సాహిత్య సాధన చేశారు. సాహిత్యం గురించీ, కవిత్వం గురించీ కొన్ని నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. మహబూబ్‌ ఖాన్‌ గా పుట్టిన ఈయన... ముస్లిం జీవితాన్ని గురించి పెద్దగా రాయలేదు. అది అతని పాలసీ. సుగంబాబు గా బతికి సుగంబాబు గానే చనిపోయారు. చివరి దశలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను యువ కవులు విమర్శించారు.

                                    కవిత్వ రెక్కలు తెగిపడ్డాయి.. సుగంబాబు కు అశ్రు నివాళి : సాహితీస్రవంతి

ఆంధ్రప్రదేశ్‌ సాహితీస్రవంతి సుగంబాబుకు అశ్రునివాళి అర్పించింది. కెంగార మోహన్‌ మాట్లాడుతూ... సుగమ్‌ బాబు లేరనే వార్త కవిత్వ ప్రేమికులు జీర్ణించుకోవడం కష్టం అని అన్నారు. అతడు కవిత్వానికి రెక్కలు కట్టి మరీ పైకెగిరించారని కొనియాడారు. మార్క్సిస్ట్‌ దఅక్పథం కలిగిన కవి అని, తెలుగు కవిత్వాన్నెంతో ప్రభావితం చేశారని చెప్పారు. ఆయన గూర్చి ఒక్కమాటలో చెప్పాలంటే... ''నిఖార్సైన మార్క్సిస్ట్‌ కవి'' అని అభివర్ణించారు. ఈరోజు తెల్లవారుజామున మరో ప్రపంచాన్ని వెదుకుతూ అస్తమించిన సుగమ్‌ బాబుకి జోహార్లు అర్పించారు.