Feb 08,2023 15:54

నాగ్‌పూర్‌ : భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గురువారం నాగ్‌పూర్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మ్యాచ్‌ మొదలవక ముందే నాగ్‌పూర్‌ పిచ్‌పై ఆస్ట్రేలియా జర్నలిస్టులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. దీనిపై బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ప్రశ్నించగా పిచ్‌పై కాకుండా మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని అన్నాడు. 'మీరు పిచ్‌పై కాకుండా క్రికెట్‌పై దృష్టి పెట్టండి. మ్యాచ్‌ ఆడే మొత్తం 22 మంది నాణ్యమైన ఆటగాళ్లే' అని చెప్పాడు. ఇక, నాగ్‌ పూర్‌ పిచ్‌ స్పిన్నర్లకు సహకారం అందించేలా ఉందన్నాడు. అందువల్ల బ్యాటర్లు స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ ఒక్కో పరుగు జోడించాల్సిన అవసరం ఉందన్నాడు. స్పిన్‌ ఎక్కువగా ఉంటే, ఆడే విధానం మార్చుకోవాలని.. సాధారణంగా బ్యాటింగ్‌ చేయకుండా కౌంటర్‌ అటాక్‌తో స్వీప్‌ షాట్స్‌ ఆడాలని తెలిపారు. ఎవరైతే బెస్ట్‌ పర్ఫామెన్స్‌ ఇస్తారో వాళ్లకే విజయం వరిస్తుందని తెలిపాడు.