Palestinians : శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి : ఐదుగురు పాలస్తీనియన్లు మృతి
గాజా : ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరంపై ఆదివారం అర్థరాత్రి వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఐదుగురు పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ సైన్యం జెనిన్ శిబిరంపై దాడి చేసేందుకు పక్కా ప్రణాళికగా సాయుధ వాహనాలు, కాన్వారు చుట్టుముట్టి బాంబులు విసిరింది. దీంతో ఇళ్లు, రోడ్లు ధ్వంసమైపోయ్యాయని నివాసితులు అధికారులకు తెలిపారు. ఈ దాడిలో పాలస్తీనియన్లు ఐదుగురు మృతి చెందగా, 27 మంది గాయపడినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై జెనిన్ డిప్యూటీ గవర్నర్ కమల్ అబు అల్ - రబ్ మాట్లాడుతూ.. 'ఇజ్రాయెల్ సైన్యం ప్రజలను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పటికే విద్యుత్, టెలికమ్యూనికేషన్లు, తాగునీటిని నిలిపివేసింది. జెనిన్ నివాసితులందరికీ, ముఖ్యంగా శరణార్ధి శిబిరానికీ ఇది సామూహిక శిక్ష' అని ఆయన అన్నారు. అలాగే శిబిరం లోపల ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న చర్యలు 'ఉగ్రవాదం' అని ఆయన అభివర్ణించారు.
కాగా, ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ఉదయం కూడా దాడులను కొనసాగిస్తూనే ఉంది. శరణార్థుల శిబిర ప్రవేశాలను ట్రాక్టర్లతో మూసివేసింది. అయితే ఈ దాడి వల్ల శిబిరంలో గాయపడిన వారు ఇంకా ఉన్నారని.. వారి దగ్గరకు వైద్య బృందాలు చేరుకోవడం కష్టంగా ఉందని జెనిన్‌లోని ఇబ్న్ సిన్హా హాస్పిటల్‌లోని సర్జరీ హెడ్ తౌఫీక్ అల్ షోబాకీ మీడియాతో అన్నారు. ప్రస్తుతం శస్త్ర చికిత్స చేయించుక్ను వ్యక్తుల్ని పర్యవేక్షించడం కోసం వారిని ఐసియులో ఉంచామని అన్నారు. గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. దీంతో ఐసియు గదుల కోసం తాము ఇతర ఆసుపత్రులతో సంప్రదింపులు జరుతున్నట్లు షోబాకీ తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం శరణార్థి శిబిరాలపై చేసిన దాడిని పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది.










