- ఉదయం 9.30గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
నాగ్‌పూర్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్స్ బెర్త్ లక్ష్యంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే తొలి టెస్ట్‌కు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే తొలి టెస్ట్‌కు టీమిండియా జట్టు కూర్పు ప్రధాన సమస్యగా తయారైంది. టెస్ట్ సిరీస్‌కు ప్రధాన కీపర్‌గా ఎంపికైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతడు ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో కీపింగ్ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ఆటగాడు శ్రీకర్ భరత్ భుజస్తంధాలపై పడింది. కీపింగ్ బాధ్యతలు ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు అప్పగించాలని భావిస్తే.. అతనిపై అదనపు భారం పడినట్లే.
- ఓపెనర్లకు పోటీ..
టీమిండియా ఓపెనర్లగా ముగ్గురు రేసులో ఉండడం జట్టు యాజమాన్యానికి ప్రధాన తలనొప్పిగా తయారైంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మతోపాటు ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ మధ్య తీవ్ర పోటీల నెలకొంది. ఒకవేళ కేఎల్ రాహుల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించాల్సి వస్తే మాత్రం అతడు మిడిల్ ఆర్డల్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశముంది. ఇక టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనబడుతోంది. అతడు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సహజసిద్ధ బ్యాటింగ్ స్టైల్‌కు భిన్నంగా ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్న క్రమంలో భారీషాట్లకు వెళ్లకుండా క్రీజ్‌లో నిలబడి మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది.
- స్పిన్నర్ల ఎంపికపైనా దృష్టి..
కుల్దీప్ యాదవ్, యజ్ఞేంద్ర చాహల్ ప్రధాన స్పిన్నర్లు కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్ కోటాలో ఒకరికి బెర్త్ దక్కడం ఖాయం. మూడో స్పిన్నర్ అవసరమని భావిస్తే మాత్రం అక్షర్ పటేల్‌కు చోటు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాగ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముండగా.. ఒక్క పేసర్‌తోనే తుదిజట్టును ప్రకటించే అవకాశముంది. గాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం అవ్వడంతో ఆ ప్లేస్‌ను ఫిల్ చేసే తలనొప్పి టీమ్ మేనేజ్‌మెంట్‌కు వచ్చింది.
- 100టెస్టుల క్లబ్‌లో పుజారా..
టీమిండియా టెస్ట్ బ్యాటర్ ఛటేశ్వర పుజారా అరుదైన రికార్డుకు చేరువలో నిలిచాడు. ఇప్పటివరకు 98టెస్టులు ఆడిన పుజారా మరో రెండు టెస్టులు ఆడితే 100టెస్టుల క్లబ్‌లో చేరనున్నాడు. భారత్ తరఫున ఇప్పటివరకు సచిన్, ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, గవాస్కర్, వెంగ్‌సర్కార్, గంగూలీ, ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్, సెహ్వాగ్‌లు 100కు పైగా టెస్ట్‌లు ఆడి ఉన్నారు. ఇప్పుడు పుజారా వారి సరసన చేరనున్నాడు.
అంచనా..
ఇండియా : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్/సూర్యకుమార్, కేఎల్ రాహుల్, పుజరా, కోహ్లి, జడేజా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్/కుల్దీప్, షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఖవాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్(వికెట్ కీపర్), హ్యాండ్‌కోంబ్/రెన్‌షా, క్యారీ, అగర్, బొలండ్, లియాన్.










