ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన బుధవారం జెఎన్‌టియు గురజాడ ఇంజినీరింగ్ విద్యార్థులు చేపట్టిన పోరాటం ఫలించింది. విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలపై సుమారు 29 డిమాండ్లపై ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు యూనివర్సిటీ గేటు బయట ఎస్ ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీంతో అర్ధరాత్రి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చర్చల జరిపారు. యూనివర్సిటీలో ముఖ్యంగా హాస్టల్ లో చదువుతున్న మౌలికంగా బాత్‌రూమ్ సమస్య ఉందని, అదనపు బాత్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, టెక్నికల్ విద్యార్థులకు అవసరం అయిన వైఫే కనెక్షన్ ఏర్పాటు చేయాలని, హాస్టల్‌లో రన్నింగ్ వాటర్ సదుపాయం మెరుగుపరచాలని, వీధి లైట్లను ఏర్పాటు చేసి విద్యార్థులను పాముల బెడద నుంచి కాపాడాలని, విద్యార్థులకు ఉన్న సెంట్రల్ లైబ్రరీ లో వారి చదువుకు అనుగుణంగా పుస్తకాలు ఏర్పాటు చెయ్యాలని, విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని, క్రీడలకు సంబంధించి ఇండోర్ స్టేడియంను మరమ్మతులు చేసి,విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్.వెంకటేష్, పి.రామ్మోహన్ మాట్లాడుతూ నిర్విరామంగా బెదిరింపులకు లొంగకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన జె ఎన్ టి యు గురజాడ యూనివర్సిటీ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యూనివర్సిటీలకు నిధులు కేటాయించడంపై సవతితల్లి ప్రేమ చూపుతోందని,గురజాడ యూనివర్సిటీకి నిధులు కేటాయించి అభివృద్ధికి కషి చేయాలని కోరారు. కోరారు. వైస్ ఛాన్సలర్ ఇచ్చిన హామీ ప్రకారం సమస్యలు నెలరోజుల్లో పరిష్కారం చేయాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు.