ప్రజాశక్తి - రాయచోటి : నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ ఎఇలు, డిఇలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఒలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి రోజురోజుకు పురోగతి కనిపించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మంజూరైన ఇళ్లన్నీ 100 శాతం పూర్తి చేయించాలని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేలు రుణం ఇప్పించాలన్నారు. హౌసింగ్ లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయించడంలో డిఆర్‌డిఎ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలకు నీటి సౌకర్యం, విద్యుత్తు కనెక్షన్ ఇచ్చి నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకుని లేఅవుట్ వారీగా ఇచ్చిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఎంపిడిఒలు సచివాలయం వారీగా ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షులు నిర్వహించి ఇచ్చిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. కొన్ని మండలాల్లో అనుకున్న స్థాయిలో నిర్మాణాలు జరగడంలేదని, వచ్చే వారం నాటికి నిర్మాణాల్లో పురోగతి కనిపించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద జిల్లాలో మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులందరూ చర్యలు చేపట్టాలన్నారు. పిఎంఎవై గ్రామీణ్ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక ద ష్టి సారించి ఇంకా ప్రారంభం కాని ఇంటి నిర్మాణాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఈ దిశగా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి అన్నమయ్య జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.ఈ సందఠంగా మండలాల వారీగా ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సుదీరెంగా చర్చించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శివయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఇ ప్రసన్నకుమార్, డిఇ శ్రీనివాస్‌రెడ్డి, సిపిఒ కృష్ణనాయక్, మున్సిపల్ కమిషనర్ రాంబాబు పాల్గొన్నారు.
టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు
టిడ్కోలో మౌలిక వసతులు యుద్ధప్రాతిపదికన కల్పించాలని అధికారులను, కాంట్రాక్టర్లను కలెక్టర్ గిరీష ఆదేశించారు. పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ వేగవంతం చేసేందుకు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మదనపల్లి టిడ్కో గృహాల్లో మౌలిక పనులన్నీ మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు. సిసి రోడ్లు, ఇంటింటికీ నీటి కనెక్షన్, అండర్ డ్రైనేజ్ తదితర పనులన్నీ జనవరి చివరిలోగా పూర్తి చేయాలన్నారు. ఎస్‌టిపి పనులను వారంలోగా పూర్తి చేయాలన్నారు. మదనపల్లి, రాయచోటి టిడ్కోలో ఎంత మంది లబ్ధిదారులు, ఎన్ని పూర్తి అయ్యాయి, ఇంకా ఎన్ని పూర్తి చేయాలి వంటి వివరాలను మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ అడిగి తెలుసుకుని పెండింగ్ పనులన్నీ త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వచ్చే వారం కల్లా పనులన్నీ ప్రారంభం కావాలన్నారు. రాయచోటి టిడ్కోలో పెండింగ్ పనులను జనవరి మొదటి వారంలోగా పనులు ప్రారంభించాలన్నారు. సమీక్షలో రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాంబాబు, టిడ్కో డిఇలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.










